
మైదుకూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆదివారం చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారి బైపాస్‌పై కలసపాడుకు చెందిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగి షేక్ ఖాదర్ హుస్సేన్ (52) దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధికి చెందిన ఖాదర్ హుస్సేన్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం బ్యాంక్ పని మీద వెళుతున్నాను అంటూ భార్య ఫాతిమాకు చెప్పి మోటార్ బైక్‌పై బయల్దేరారు. మైదుకూరు శివారులో జాతీయ రహదారి బైపాస్‌పైన ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సంఘటనలో బైక్‌పై ఉన్న ఆయన తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి ఖాదర్ హుస్సేన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. మృతునికి మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు, ఆమె మృతి చెందిన తర్వాత చేసుకున్న రెండో భార్య ఫాతిమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.