
రిటైర్డ్ ఏఎస్పీకి ఘన వీడ్కోలు
రాయచోటి : పోలీసు వేసిన ప్రతి అడుగు, ధరించిన యూనిఫామ్, కృషి, క్రమశిక్షణ, నిజాయతీలన్నీ పోలీసు శాఖ చరిత్రలో నిలిచిపోతాయని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్‌ఐ నాయబ్ ఉస్మాన్ ఘనీ ఖాన్‌కు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనమైన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్టం, ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగం అమూల్యమైందని ఏఎస్పీ అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణ సమయంలో కుటుంబం చూపిన సహనం, మద్దతు కూడా ప్రశంసనీయమన్నారు.
అనంతరం ఏఎస్‌ఐను అదనపు ఎస్పీ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పి రాజా రమేష్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎం చంద్రశేఖర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎం తులసీరామ్, ఆర్‌ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పదవీ విరమణ పొందిన ఏఎస్‌ఐ కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుడిపై పిచ్చికుక్క దాడి
మదనపల్లె రూరల్ : వృద్ధుడిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సోమవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. చెర్లోపల్లి పంచాయతీ చిలకుంట గ్రామానికి చెందిన రెడ్డప్పనాయుడు(70) ఇంటి ముందు కూర్చొని ఉండగా, అదే సమయంలో అటుగా వచ్చిన పిచ్చి కుక్క ఆయనపై దాడి చేసి, తీవ్రంగా కరిచి గాయ పరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు.
మల్టీ డే మ్యాచ్‌లో చిత్తూరు, నెల్లూరు విజయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 132 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 55.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తేజరెడ్డి 142 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడి 106 పరుగులు చేశాడు. రెడ్డి ప్రకాశ్ 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, ప్రవీణ్‌కుమార్ సాయి 3 వికెట్లు తీశారు.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 46.2 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నిస్కయ్ 47, ప్రవీణ్ కుమార్ సాయి 32 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బ్రహ్మసాయి తేజ్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14.5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 52, జెనిక్ దాస్ 34 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని భార్గవ 2 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కడప జట్టుపై నెల్లూరు జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం రెండవ రోజు 140 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 86.1 ఓవర్లలో 501 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 167, సోహన్ వర్మ 68, మాధవ్ 66, శ్రీ హర్ష 58 పరుగులు చేశారు. కడప జట్టులోని ఎస్‌ఎండీ ఆయూబ్ 4, వరుణ్‌తేజ్‌రెడ్డి 4, చెన్నారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 33.1 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 53, నాగ చాతుర్య 33 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, నారాయణ 2, సూతేజ్‌రెడ్డి 2 వికెట్లు తీశారు.