
గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు
రామసముద్రం : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు త్రేతాయుగం నాటి ఆలయాన్ని ధ్వంసం చేసిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. భక్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆర్.నడింపల్లి పంచాయతీ బల్లసముద్రం కొండపై వెలసిన శ్రీవాలీశ్వర ఆలయం త్రేతాయుగంలో అప్పటి వాలీ నిర్మించారు. ఆలయంలో ప్రతి సోమవారం పూజలు నిర్వహిస్తారు. వారం రోజులుగా కొండపైకి వెళ్లే దారిలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఆర్.నడింపల్లి గ్రామానికి చెందిన భక్తులు మరమ్మతులు చేసేందుకు 10 మంది కొండపైకి సోమవారం ఉదయం వెళ్లారు. అయితే ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న రాతి గోడను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. అప్పటి కాలంలో నిర్మించిన పురాతన ఆలయానికి ఉన్న పెద్ద పెద్ద రాతి గోడలను నిధుల కోసం ధ్వంసం చేసి సొరంగం పెట్టారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించని పోలీసులు మండలంలోనే ప్రఖ్యాతి గాంచిన అతి పురాతన ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారన్న విషయంపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడంపై స్థానికులు, భక్తులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆలయం వద్ద ధ్వజస్తంభంను ధ్వంసం చేసి నిధులు దోచుకెళ్లిన దుండగులను గుర్తించలేదని వారు తెలిపారు. పురాతన ఆలయాన్ని గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడిన ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు