
ఇమామ్, మౌజన్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
రాయచోటి టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర విభాగం పిలుపులో భాగంగా మైనార్టీ విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ మైనార్టీలకు గౌరవేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాట పూర్తిగా మరిచిపోయిందన్నారు. ఓట్లు వేయించుకునే వరకు ఒక విధంగా మాట చెప్పిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తరువాత మీరు మాకెందుకు అన్న విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. అదే వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇమాంలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ప్రతి నెల ఇచ్చేవారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. సెప్టెంబరు వరకు ఎనిమిది నెలల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతేడాది ఎన్నికల సమయమైన ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. ఇలా 11 నెలల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. దీనివల్ల ఇమామ్, మౌజన్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మసీదు కమిటీలు కూడా ఈ చెల్లింపులను భరించలేకపోతున్నాయన్నారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరారు. నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో 20 ఏళ్ల క్రితం తెలుగు దేశం పార్టీనే షాదీ మహాల్ నిర్మాణం కోసం అరకొరగా నిధులు కేటాయించడంతో అది ఆదిలోని ఆగిపోయిందన్నారు. తరువాత దీనిని విస్మరించారని చెప్పారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి షాదీమహల్ పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేస్తే నిరుపేదలు ఉపయోగించుకొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్పార్ సీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిమి హారూన్ బాషా, వైఎస్సార్ సీపీ మైనార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బేపారీ మహమ్మద్, రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రహిమాన్, రాయచోటి మైనార్టీ నాయకుడు జాఫర్ ఆలీఖాన్, మదనపల్లెకు చెందిన యూనస్, రహ్మతుల్లా, షఫీభాయ్, జబీవుల్లా, యాసీన్, తాజ్ భాయ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.