మదనపల్లె రూరల్ : మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై తనయుడు దాడి చేసిన సంఘటన మదనపల్లె మండలంలో సోమవారం రాత్రి జరిగింది. కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మకాలనీకి చెందిన షేక్‌గౌస్‌సాహెబ్’(65) వద్ద పెన్షన్ డబ్బు ఉంది. ఆ డబ్బు మద్యం తాగేందుకు కుమారుడు షేక్‌సైపుల్లా అడిగాడు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో కర్రతో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కేవీపల్లె : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గ్యారంపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. గ్యారంపల్లె పంచాయతీ కొత్తపల్లెకు చెందిన గండికోట రమణ (50) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంలో పక్క గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే చిత్తూరు – కడప జాతీయ రహదారిలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని చీకటిలో గమనించకపోవడంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు.
తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ
నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష
కలికిరి : తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టుకు తప్పుడు ధ్రువీకరణ అందచేసినట్లు నిర్ధారణ కావడంతో నిందితునికి ఏడేళ్లు జైలు శిక్ష, ఇరవై వేలు రూపాయల జరిమానా విధిస్తూ వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గురు అరవింద్ తీర్పునిచ్చారు. పోలీసుల కథనం మేరకు... కలికిరి పంచాయతీ వెంకటేశ్వరపురంలో నివాసం ఉండు ముల్లంగి రమేష్, గడ్డం శ్రీనివాసులుకు నివాస స్థలం విషయంలో తగాదాలున్నాయి. 2017లో గడ్డం శ్రీనివాసులు అప్పటి తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎంజాయ్‌మెంట్ ధృవీకరణ పత్రాన్ని పొందాడు. దీంతో గడ్డం శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ తుదిదశకు చేరుకుని పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు నిందితునికి శిక్ష విధుస్తూ తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్ కేసును వాదించారు. కేసుకు సంబంధించి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచిన సీఐ అనీల్‌కుమార్, కోర్టు కానిస్టేబుల్ రెడ్డెప్పలను డీఎస్పీ క్రిష్ణమోహన్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించారు.