కుటుంబం...బ్యాంకు బాధ్యతలు బ్యాలెన్సు చేయలేక పోతున్నా.. | Karur Vysya Bank Manager Pawan Kumar Naidu Ends His Life In Bank Due To Stress, More Details Inside | Sakshi
Sakshi News home page

కుటుంబం...బ్యాంకు బాధ్యతలు బ్యాలెన్సు చేయలేక పోతున్నా..

Sep 13 2025 9:15 AM | Updated on Sep 13 2025 9:48 AM

Karur Vysya Bank Manager Pawan Kumar Naidu

లేఖలో రాసిపెట్టి...

బ్యాంకులోనే ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకున్న మేనేజర్‌ పవన్‌ కుమార్‌ నాయుడు

అన్నమయ్య జిల్లా: కుటుంబం, బ్యాంకు పరిధిలోని బాధ్యతలను సమన్వయం చేయలేక తనువు చాలిస్తున్నట్లు స్వహస్తాలతో లేఖరాసి తాను పనిచేస్తున్న బ్యాంకులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో సంచలనంగా మారింది. రాయచోటిలోని కరూర్‌ వైశ్యా బ్యాంకులో మేనేజర్‌ పవన్‌ కుమార్‌ నాయుడు (38) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బ్కాంకులోని మరుగుదొడ్డిలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సుండుపల్లి మండలం, చప్పిడివారిపల్లికి చెందిన పవన్‌ కుమార్‌ నాయుడు ఐదు నెలల క్రితం బ్యాంక్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మరుగుదొడ్డిలోకి వెళ్లిన మేనేజర్‌ ఎంతసేపటికీ బయటకు రాలేదు. బ్యాంకు ఉద్యోగులు పిలిచినా పలుకలేదు. దీంతో డోర్‌ పగులకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే బ్యాంక్‌ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి అర్బన్‌ ిసీఐ బివి చలపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్యకు గల కారణాలు లేఖలో రాసిపెట్టినట్లు తెలిసింది. కుటుంబ బాధ్యతలను, బ్యాంకు పని ఒత్తిడిని సమన్వయం చేసుకోవడంలో విఫలం అయ్యానని రాసినట్లు తెలిసింది. 

బ్యాంకులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని భార్య అనూష ఆరోపిస్తున్నారు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ిసీఐ తెలిపారు. అయితే లేఖలో రాసిన విషయాలతోపాటు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బ్యాంక్‌ సిబ్బంది, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పంచనామా నిమిత్తం బ్యాంక్‌ మేనేజర్‌ మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్‌ కుమార్‌ నాయుడుకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement