
ఎస్‌జీటీ, ఎస్‌ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం
ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు
మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడమేంటి?
మెరిట్‌ను పట్టించుకోకపోతే ఎలా? అసలు ఇవేం నిబంధనలు?.. అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు
ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం.. ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదు
మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ పోస్టు తీసుకోమంటే ఎలా?
వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి
మెరిట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే
అందులో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం.. ఈ వ్యవహారాన్ని 4 వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని కోరిన జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం
ఎస్‌జీటీకి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచి్చ.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్‌ను ఎలా విస్మరిస్తారు? మెరిట్‌ను కాదని ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటి? ఇది ఎంత మాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేం.
– హైకోర్టు ధర్మాసనం
మెరిట్ లిస్ట్‌లో ఉన్నా ఎంపిక చేయలేదు
నేను ఎస్టీ కేటగిరి మహిళను. మెరిట్ లిస్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), ఎస్‌జీటీ విభాగాల్లో నా పేరు ఉంది. ఎస్‌జీటీలో 61.63.. ఎస్‌ఏలో 61.00 స్కోర్ వచ్చింది. మూడో విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు. అధికారులు నా సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు.
– కమ్మిడి లత, డుంబ్రిగుడ, అల్లూరి సీతారామరాజు జిల్లా
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కింద సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులను అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వారిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలను తీసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయ పడింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతలను కోరి ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది.
పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్‌జీటీ పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని, ఆ తర్వాత రాత పరీక్షలో వారు ఎస్‌ఏ పోస్టులో అత్యుత్తమ ర్యాంకు సాధించినప్పటికీ, ప్రాధాన్యత కింద ఎస్‌జీటీ పోస్టును ఎంపిక చేసుకున్నారు కాబట్టి, ఎస్‌ఏ పోస్టు ఇవ్వమని చెప్పడం దారుణమంది. ఎస్‌జీటీ నుంచి పదోన్నతిపై ఎస్‌ఏగా నియమితులవుతారని, కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్‌ఏగా కాకుండా ఎస్‌జీటీగా నియమిస్తామనడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించింది.
అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి, మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలంది. ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. ఎస్‌జీటీ, ఎస్‌ఏ పోస్టులకు పరీక్షలు రాసి, రెండింటిలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్‌ఏ పోస్టుకు అర్హులేనని, పోస్టుల భర్తీలో మెరిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది.
ఈ మొత్తం వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాలు లేక, వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉంటారని, అలాంటి వారి విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జి
స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఎస్‌ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్, మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సింగిల్ జడ్జి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు.
మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషనర్లను ఎస్‌ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని, వారిని ఎస్‌ఏ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్లు వేసిన ప్రభుత్వం
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై మంగళవారం జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్‌ను పిటిషనర్లు సవాలు చేయలేరన్నారు. దరఖాస్తుల సమయంలోనే ప్రాధాన్యతలు ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు.
దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కోర్టుకొచ్చారని తెలిపారు. ఎస్‌జీటీ పోస్టులు ఎక్కువ ఉండటంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలను ఇచ్చారన్నారు. దాని ప్రకారమే వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులిస్తే, మరింత మంది అభ్యర్థులు వేర్వేరు అభ్యర్థనలతో కోర్టుకొస్తారని, దీని వల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందన్నారు.
ఎస్‌జీటీ నుంచి ఎస్‌ఏ కావాలంటే 20 ఏళ్లు పడుతుంది
పిటిషనర్ల తరఫున జీవీఎస్ కిషోర్ కుమార్, గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. పిటిషనర్లు రాత పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని, అందువల్ల వారు ఎస్‌ఏ పోస్టులకు అర్హులవుతున్నారని తెలిపారు. అయితే దరఖాస్తు సమయంలో వీరు ఎస్‌జీటీకి తమ ప్రాధాన్యతను ఇచ్చారని, ఎక్కువ పోస్టులు ఉండటంతోనే అలా చేశారని వివరించారు. ఎస్‌జీటీ నుంచి ఎస్‌ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్లాలంటే 20 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు. మెరిట్‌ను కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు.
ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు? ర్యాంకులెందుకు?
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే, ఇక మెరిట్ ఎందుకని, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఎస్‌జీటీకి, ఎస్‌ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచ్చి.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరు పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్‌ను కాకుండా ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని నిలదీసింది.
మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే నివేదించి.. తుది విచారణ జరిపి పిటిషన్లపై నిర్ణయం వెలువరించేలా చూడాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను పరిష్కరించింది.
ఆ విభాగంలో నేనొక్కడినే.. అయినా పోస్టు రాలేదు
డీఎస్సీ నిర్వహణ తొలి నుంచి లోపభూయిష్టంగా ఉంది. కనిగిరి మండలంలో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో డీఎస్సీ ఫిజికల్ సైన్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో మెన్‌కు ఒకపోస్టు, ఉమెన్‌కు ఒక పోస్టు ఉన్నాయి. డీఎస్సీలో నాకు 34.55 శాతం మార్కులు వచ్చాయి. ఆ పోస్టుకు ఒక్కడినే ఉండడంతో కాల్ లెటర్ పంపించారు.
ఈ నెల 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. హియరింగ్ ఇంపెయిర్డ్ నిర్ధారణ కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. తీరా సోమవారం ప్రకటించిన డీఎస్సీ జాబితాలో నా పేరు లేదు. మరోవైపు హియరింగ్ ఇంపెయిర్డ్ కోటా కింద ఉన్న ఒక పోస్టును క్యారీ ఫార్వార్డ్‌లో పెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
– వెంకటనారాయణ, కనిగిరి, ప్రకాశం జిల్లా
‘అనంత’లో తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగాలు
డీఎస్సీ–25 తుది ఎంపిక జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ మెరిట్ ఉన్నవారి పేర్లు ఉండడంతో అర్హులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌ఏ ఇంగ్లిష్‌లో ఎ.ఆంజనేయులు 48వ ర్యాంకులో ఉన్నాడు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బీసీ–ఏ కేటగిరీకి చెందిన ఈ అభ్యర్థి కంటే వెనకున్న 49వ ర్యాంకు అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఉన్నాడు. బీసీ–ఏ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి.
ఈయన కంటే వెనుకున్న 8 మంది ఎంపిక జాబితాలో ఉన్నా, ఎ.ఆంజనేయులు పేరు లేకపోవడంతో డీఈఓను కలిసి విన్నవించాడు. చంద్రిక అనే అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ రెండు పోస్టులకూ ఎంపికైంది. ఈమె కేజీబీవీలో పని చేస్తోంది. కేజీబీవీలో పని చేస్తూ బీపీఈడీ కోర్సు చేసిందనే ఫిర్యాదు రావడంతో ఆ పోస్టుకు అనర్హురాలిగా తేల్చారు. యూజీపీడీ ఉన్న కారణంగా పీఈటీ పోస్టుకు ఎంపికైంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది.
ఎంపిక జాబితాలో మాత్రం ఈమె పేరు లేదు. తన కేటగిరీలో తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయంటూ ఆమె అధికారులను కలిసి వాపోయారు. మెంటల్లీ ఇన్‌హెల్త్ కేటగిరీ కింద కె.శ్రీనివాసులు అనే అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉన్నాడు. ఈయనకు ‘0’ శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినా.. ఆ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఫలితంగా ఆయన అర్హత లేకపోయినా ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
– సాక్షి నెట్‌వర్క్
డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి : కేవీపీఎస్
సాక్షి, అమరావతి: డీఎస్సీలో మెరిట్ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, సామాజిక న్యాయానికి తూట్లు పొడవద్దని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరిట్‌లో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే చూపించే ప్రతిపాదన సరికాదన్నారు.
నిరుద్యోగులతో చెలగాటం : డీవైఎఫ్‌ఐ
సాక్షి, అమరావతి: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, డీఎస్సీ–2025లో జరిగిన గందరగోళం ఏ డీఎస్సీలోనూ జరగలేదని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట నిరసన తెలిపారు.