
తనకల్లు/ వేంపల్లె : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. కూలి కాస్త ఎక్కువగా వస్తుందన్న ఆశతో జిల్లాదాటి వచ్చారు. రోజంతా టమాట తొలగింపు పనుల్లో అలసిపోయారు. సూర్యుడు అస్తమించే వేళ ఆ రోజు అందిన కూలి తీసుకుని స్వగ్రామాలకు ఆటోలో పయనమయ్యారు. ఇంట్లో బిడ్డల గురించి ఒకరు, భార్య ఆరోగ్యం గురించి మరొకరు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నారు. కానీ ఆటో బోల్తా పడగా వారి జీవితాలు అక్కడే ముగిసిపోయాయి. కూలీలతో వెళ్తున్న ఓ ఆటో మండలం పరిధిలోని కొక్కంటి సమీపంలోని మించిలవారికోట రోడ్డు వద్ద బోల్తా పడడంతో వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన వ్యసాయ కూలీలు పట్టా దేవనాథ్ (45), బత్తల హేమలత (32) మృతి చెందారు.
తిరిగి వెళ్తూ.. తిరగిరాని లోకాలకు
వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందిన పలువురు వ్యవసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని అగ్రహారంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో టమాట కోసేందుకు వచ్చారు. పని ముగిసిన అనంతరం అదే ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మించిలివారికోట రోడ్డు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బత్తల హేమలతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
అదే ఆటోలో ప్రయాణిస్తున్న బూరుజుపల్లికి చెందిన పట్టా దేవనాథ్, పట్టా బయన్న, శివగంగ, కొండప్పగారిపల్లికి చెందిన పెద్ద గంగులయ్య, బురుజుపల్లికి చెందిన పట్టా బయప్ప, గాయపడ్డారు. షయం తెలుసుకున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాగేపల్లి అశోక్, బాలు, నవీన్, తండేల్ తదితరులు క్షతగాత్రులను తమ ఉచిత అంబులెన్స్‌లో తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుట్టా దేవనాథ్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ గోపి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బత్తల హేమలతకు భర్త రామాంజనేయులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శివగంగ, బేబీ, గణేష్‌లు అనే ముగ్గురు పిల్లలు ఉండగా తల్లి వెంట కుమార్తె శివగంగ కూడా కూలి పనులకు వెళ్లింది. శివగంగకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు దేవనాథ్‌కు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు బయప్ప, బయన్నలు ఉన్నారు. వీరు డిగ్రీ, ఇంటర్ చదువుకుంటున్నారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.