శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో స్నపన తిరుమంజనం జరిపారు. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
మదనపల్లె సిటీ: వృత్తి విద్యా కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ మల్లీశ్వరి అన్నారు. శనివారం పాఠశాల 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా స్థానిక నీరుగట్టువారిపల్లెలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. విద్యతో పాటు విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తున్నామన్నారు. నీరుగట్టువారిపల్లెలోని చేనేత మగ్గాలు, పవర్‌లూమ్స్ ద్వారా చీరలు నేయడం, కలర్స్ అద్దడం వంటివి విద్యార్థులకు ఒకేషనల్ ట్రైనర్ మాళవికస్వాతి చూపించి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.స్వాతి, మేనక,దిల్‌షాద్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
చిన్నమండెం: సీఎం చంద్రబాబునాయుడు ఈనె 29న జిల్లాలోపర్యటించనున్నట్లు సీఎంఓ నుంచి సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం చిన్నమండెం మండలంలో జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్‌లు అధికారులతో కలిసి పర్యటించారు. దేవపట్ల రోడ్డులో హెలీప్యాడ్ ప్రదేశాన్ని, దేవగుడిపల్లె సమీపంలోని పెట్రోల్ బంకు వెనుకవైపున నూతనంగా నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవం, దేవగుడిపల్లె హరిజనవాడ వద్ద జరిగే బహిరంగ ప్రదేశాలను పరిశీలించా రు. ఈ నెల 29న సీఎం పర్యటన ఉండటంతో అ ధికారులతో కలిసి కలెక్టర్, జేసీలు సమీక్షించారు.
రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుల 108 అడుగుల విగ్రహం (అన్నమయ్య థీంపార్కు)లో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహప్రతిష్ట మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి అన్నారు. శనివారం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబరు 31 నుంచి నవంబర్ 3వతేదీ వరకు కుంభాభిషేకం సంప్రోక్షణం జరుగుతుందన్నారు. స్వామి విగ్రహప్రతిష్టకు సంబంధించి పుష్పాలను అందచేయాలని దాత ఉద్దండం సుబ్రమణ్యంకు సూచించారు. 3న ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 9గంటలకుమహాపూర్ణాహుతి, ప్రాణప్రతిష్ట అనంతరం ధ్వజారోహణ,మహామంగళహారతి కా ర్యక్రమాలు ఉంటాయన్నారు. అదేరోజు సాయంత్రం శ్రీనివాస కల్యాణం ఉంటుందని తెలిపారు.
మదనపల్లె రూరల్: మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న 260 పోలింగ్ కేంద్రాలను జనాభా ప్రాతిపదికన 325 పోలింగ్ కేంద్రాలుగా పునర్విభజన చేస్తున్నామని, ఈమేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు. శనివారం సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ...మదనపల్లె మండలంలో 16, అర్బన్‌లో 30, నిమ్మనపల్లెలో 6, రామసముద్రంలో 13 పోలింగ్ కేంద్రాలు...1,200 మంది ఓటర్ల కంటే అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి పెంపుదలపై ఏదైనా అభ్యంతరాలుంటే రాజకీయపార్టీల ప్రతినిధులు ఓటరు జాబితాను పరిశీలించి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకాచలపతి, టీడీపీ బాలుస్వామి, సీపీఎం శ్రీనివాసులు, కాంగ్రెస్ రెడ్డిసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం


