వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి: రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వరదలు, భారీ వర్షాల విపత్తు నిర్వహణపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు,మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామన్నారు.ఆయా శాఖల అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావ్యవస్థలో ఉన్న భవాలను, పాఠశాలలను గుర్తించి ఆ ప్రదేశంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని రిజర్వాయర్‌లలో నీటి నిల్వలపై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు అలర్ట్‌గా ఉండేలా చూసుకోవాని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ గుంతలు, కాలువలు, వాగులు, వంకల వద్ద, అధికంగా నీరు ప్రవహించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లుచ తహసీల్దార్లకు సూచించారు. ఏదైనా ప్రమాదం, విపత్తు సంభవించే అవకాశం ఉన్నా, జరిగిన వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు కూడా తెలియజేయాలన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, అడిషనల్ ఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08561– 293006ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశామని, సహాయక చర్యలకు పైన ఉన్న నంబర్‌లో సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.


