
మరో 13 మందికి తీవ్రగాయాలు
క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు
అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లె చెరువు కట్టపై ఘోర ప్రమాదం
మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన కూలీలు
ఓబులవారిపల్లె/పుల్లంపేట: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తాపడి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు. ఈ దుర్ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడి కాయల్ని కోసి, లారీలో లోడ్ చేసేందుకు వెళ్లారు. మామిడి కాయల్ని లోడ్ చేసిన అనంతరం అదే లారీపై రైల్వేకోడూరు మామిడి మార్కెట్ యార్డుకు బయలుదేరారు.
లారీ రెడ్డిపల్లి చెరువుకట్టపైకి రాగా మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, సుబ్బరత్నమ్మ, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి, రాధా, వెంకట సుబ్బమ్మ మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 13 మంది కూలీలను 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారీ కూలీలే. ఘటనా స్థలాన్ని ఎస్పీ రామ్‌నాథ్ కార్గే పరిశీలించారు.
లారీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి
సాక్షి, అమరావతి: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఆదివారం రాత్రి మామిడి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది చనిపోవడం, 13 మంది తీవ్రంగా గాయ పడటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరంతా నిరుపేదలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
