ఆంధ్రరాష్ట్రం.. స్కామ్‌లమయం.. ‘భూం’ చేద్దాం..! | Govt lands for private individuals to do business in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఆంధ్రరాష్ట్రం.. స్కామ్‌లమయం.. ‘భూం’ చేద్దాం..!

Sep 8 2025 4:58 AM | Updated on Sep 8 2025 7:30 AM

Govt lands for private individuals to do business in Chandrababu Govt

ఏపీఐఐసీకి చెందిన విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం

ప్రైవేట్‌ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వ భూములు 

పప్పు బెల్లాలు, శనక్కాయల మాదిరిగా పంపిణీ 

ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా భూములు ధారాదత్తం 

రాష్ట్రంలో స్కామ్‌ల మయంగా భూ కేటాయింపులు..

నిన్న.. ఊరూ పేరు లేని ‘ఉర్సా’కు ఉత్త పుణ్యానికే..! 

నేడు.. మూతబడ్డ కంపెనీలకూ పందేరం

వీటికి అదనంగా ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్‌ సబ్సిడీతో పాటు 100 శాతం నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఏపీఐఐసీ నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్‌ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి.

సాక్షి, అమరావతి: సర్కారు భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకే ఆదాయం సమకూరుతుంది! భావి తరాలకు విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ‘ఏపీఐఐసీ’ లాంటి ప్రభుత్వ సంస్థలే భేషుగ్గా ఉన్నాయి! కానీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు తమకు కావాల్సిన వారికి భూములను పప్పు బెల్లాలు, శనక్కాయల మాదిరిగా పందేరం చేస్తోంది.. ప్రభు­త్వా­నికి పైసా ఆదాయం లేకుండా ప్రైవేట్‌ వ్యక్తులకు పంచి పెడుతోంది. 

రాష్ట్రంలో భూ కేటాయింపులను స్కామ్‌లమయంగా మార్చేసింది! నిన్న.. ఊరూ పేరు లేని ‘ఉర్సా’ నుంచి నేడు.. మూతబడ్డ కంపెనీలకు భూములను కట్టబెట్టడం దాకా ఇదే తంతు! ముడుపులు మూటగట్టే వారికి అప్పనంగా పంచిపెట్టడం కూటమి సర్కారు అవినీతి, దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏది చెబితే అది వేదవాక్కుగా భావించి అమలు చేస్తారని పేరున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీపార్థసారథి డైరెక్టర్‌గా ఉన్న ‘ఇఫ్కో కిసాన్‌ సెజ్‌’కు నెల్లూరులో ఏకంగా 2,776.23 ఎకరాలు కేటాయించడం భూ సంతర్పణలకు పరాకాష్ట!! అలాగే.. ‘స్కైరూట్‌’ కంపెనీకి చిత్తూరు జిల్లా రౌతు­సు­ర­­మాలలో 300 ఎకరాలను ధారాదత్తం చేశారు. 

సీఎం చంద్రబాబుతో లక్ష్మీ పార్థసా­రధి  

టెండర్లు లేకుండానే వేలాది ఎకరాలు
రాష్ట్రంలో ఏపీఐఐసీకి చెందిన వేలాది ఎకరాలు పచ్చ నేతలకు ఫలహారంగా మారుతున్నాయి! ప్రైవేట్‌ ఇండ్రస్ట్రియల్‌ పార్క్స్‌ విత్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే పేరిట ఇప్పటికే 5,221 ఎకరాలను కట్టబెట్టడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క అసలు ఎటువంటి టెండర్లే  లేకుండా తమకు కావాల్సిన  వారికి 4,246.30 ఎకరాలు కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

కేతన్‌ పరేఖ్‌ స్టాక్‌ స్కామ్‌లో భాగంగా హెచ్‌ఎఫ్‌సీఎల్‌కు సెబీ షోకాజు నోటీస్‌ జారీ చేసినట్టు తెలిపే భాగం 

అంతేకాదు.. ఈ భూములను అభివృద్ధి చేసి­నందుకుగాను ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్‌ సబ్సిడీతో పాటు 100 శాతం నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇలా ఏపీఐఐసీ నుంచి  భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్‌ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి.

ఇఫ్కో కిసాన్‌ సెజ్‌కు 2,776.23 ఎకరాలు
నెల్లూరులో పలు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిన ఏపీఐ­ఐ­­సీని కాదని.. ఏకంగా 2,776.23 ఎకరాలను పారిశ్రామిక పార్కు అభివృద్ధి పేరుతో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌కు కూటమి సర్కారు కేటాయించింది. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా వ్యవహరించే మాజీ ఐఏఎస్‌ అధికారి దేవరకొండ లక్ష్మీపార్థసా­రధి భాస్కర్‌ ఈ కంపెనీ డైరెక్టర్లలో ఉన్నారు. 2014–19­లోనూ, ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

గతంలో టీడీపీ సర్కారులో అమరావతి డెవ­ల­ప్‌­­మెంట్‌ కార్పొరేషన్, అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ ప్రైవేట్‌ లిమిటె­డ్‌లోనూ డైరెక్టరుగా వ్యవ­హరించిన లక్ష్మీ పార్థసా­రధి ఇప్పుడు అమ­రావతి డెవల­ప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆమె తెలుగు­­దేశం పార్టీకి ఎంత దగ్గర అంటే.. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ స్థాపించిన ఆంధ్రా షుగర్స్‌లో కూడా డైరెక్టర్‌గా వ్యవహరి­స్తు­న్నారు. 



తమ చేతిలో మనిషిలా ఉండే పార్థసారధి ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో డైరెక్టర్‌గా ఉండటంతో రూ.వేల కోట్ల విలువైన భూములను ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు ఇచ్చేశారు.

కుంభకోణంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీకి..
2001లో దేశ స్టాక్‌ మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన కేతన్‌ ఫరేఖ్‌ కుంభకోణం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ స్కామ్‌లో ప్రధా­నంగా హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికే­షన్స్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) పేరు మారు మోగింది. 1998–2001 మధ్య మానిప్యులేషన్‌ చేయ­డం ద్వారా హెచ్‌ఎఫ్‌సీఎల్‌ ధరను భారీగా పెంచేసి కేతన్‌ పరేఖ్‌ భారీ లాభాలు గడించాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీ ప్రస్తు­తం టెలిక­మ్యూనికేషన్స్‌ రంగంలో కార్యకలాపా­లను నిర్వ­హిస్తోంది. 

వరాహ ఆక్వా ఫామ్స్‌ మూసివేసినట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కాపీ   

ఇప్పుడు అటువంటి కంపెనీ రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతుందంటూ శ్రీసత్య­సాయి జిల్లా మడకశిరలో 1,000 ఎకరా­లను కేటా­యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని చూస్తుంటే భూ కేటాయింపులపై పలు అనుమానాలు తలెత్తు­తు­న్నా­యని అధికా­రులే వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా మడకశిర వద్ద షెల్స్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడ్‌ హ్యాండ్‌ గ్రెనేడ్స్‌ తయారీ కోసం మీడియా మాట్రిక్స్‌ వరల్డ్‌వైడ్‌ లిమిటెడ్‌కు ఎకరా రూ.7 లక్షలు చొప్పున 671 ఎకరాలను కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే తాము ఉత్పత్తి ప్రారంభించడానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తుతు­న్నాయని, అందువల్ల ఈ భూమిని హెచ్‌ఎఫ్‌సీ­ఎల్‌కు బదలా­యించాలంటూ ఆ కంపెనీ కోరింది. దీన్ని ఆమోదిస్తూ, మీడియా మాట్రిక్స్‌కు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసి వాటిని హెచ్‌ఎఫ్‌ఎసీ­ఎల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువ­డ్డాయి. 

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పేరిట అడ్డగోలుగా కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. కనీసం కంపెనీల పుట్టు పూర్వోత్రాలు పరిశీలించకుండా, న్యాయ సలహాలు తీసుకోకుండా విలువైన భూములను అడ్డగో­లుగా కేటాయించడం ఏమిటని విస్తుపోతున్నారు.

రమాదేవికి 13.70 ఎకరాలు
ఇక మహిళా పారిశ్రామికవేత్తనంటూ టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రచారం చేసుకునే ‘ఎలీప్‌’ రమాదేవికి ఇప్పటికే అనకాపల్లిలో 31 ఎకరాల భూమి కేటాయించగా తాజాగా కుప్పంలో 13.70 ఎకరాలను అప్పగించారు.

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో రమాదేవి 

మూసేసిన కంపెనీకి 93 ఎకరాలు..
విశాఖకు చెందిన వరాహ ఆక్వా ఫామ్స్‌ 1994లో ఏర్పాటు కాగా ఈ కంపెనీని ప్రస్తుతం మూసివేసినట్లు (స్ట్రైక్‌ ఆఫ్‌ ) కంపెనీస్‌ ఆఫ్‌ రిజిస్ట్రార్‌ డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. ఆక్వా రంగంలో ఉన్న కంపెనీ.. అందులోనూ మూతపడిన కంపెనీకి నక్కపల్లిలో బల్క్‌డ్రగ్‌ పార్కు పక్కనే ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి పేరుతో 93 ఎకరాలను కేటాయించడం గమనార్హం.  
ఈ కంపెనీ గురించి విశాఖతోపాటు ఆక్వా రంగ ప్రముఖలను ఆరా తీయగా ఇప్పటి వరకు ఆ పేరు ఎప్పుడూ వినలేదన్న సమాధానం వచ్చింది. అలాగే ముంబైకి చెందిన ‘జే కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌’కు పెందుర్తి వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి పేరిటి 63.37 ఎకరాలను కేటాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement