
బిడ్ కెపాసిటీని మరోసారి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల విలువ ప్రాతిపదికగా తీసుకునేలా నిబంధనలు మార్పు
జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
మొబిలైజేషన్ అడ్వాన్సులకు పచ్చజెండా
సన్నిహిత కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి కమీషన్‌లు వసూలు చేసుకుంటున్న ముఖ్యనేత
సాక్షి, అమరావతి: అస్మదీయ కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో పనులు కట్టబెట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వతేదీన బిడ్ కెపాసిటీని 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా శుక్రవారం మరోసారి పెంచేసింది. ఇప్పటివరకూ ఐదేళ్ల పరిధిలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన సివిల్ పనుల విలువను ‘ఏ’గా పరిగణించగా ఇప్పుడు పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన సివిల్ పనుల విలువను ‘ఏ’గా లెక్కించేలా బిడ్ కెపాసిటీ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు (జీఎం ఎంఎస్ నెం 37) జారీ చేసింది.
సన్నిహిత కాంట్రాక్టర్లతో ముఖ్యనేత ఏర్పాటు చేసిన సిండి‘కేటు’ సంస్థలకు పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతోపాటు– రాజధాని, తాగునీటి పథకాలు తదితరాలలో రూ.వేల కోట్ల విలువైన పనులు కట్టబెట్టేందుకే బిడ్ కెపాసిటీని మళ్లీ పెంచారని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. సిండికేటు కాంట్రాక్టర్ల చేతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఉన్నాయని.. మళ్లీ కొత్తగా భారీ మొత్తంలో అప్పగించే పనులు గడువులోగా పూర్తి చేయకుంటే అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సన్నిహిత కాంట్రాక్టర్లకు అప్పగించేందుకే..
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల కింద చేపట్టే సివిల్ పనులకు 2003 జూలై 1న జలవనరుల శాఖ జారీ చేసిన జీవో 94 ఆధారంగా టెండర్లు పిలుస్తోంది. ఆ జీవో ప్రకారం టెండర్‌లో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత 2 ఏఎన్–బీగా నిర్ణయించారు. ఇందులో ఏ– అంటే ఐదేళ్ల పరిధిలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల మొత్తం! ఎన్– అంటే కొత్తగా టెండర్ పిలిచిన పనిని పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు (సంవత్సరాలు). బీ– అంటే ఆ కాంట్రాక్టర్ చేతిలో ఉన్న మిగిలిన పనుల విలువ.
కోవిడ్–19 మహమ్మారి ప్రబలిన సమయంలో గత ఐదేళ్లలో పనులు జరగలేదనే సాకుతో అడిగినంత కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో పనులు అప్పగించేందుకు బిడ్ కెపాసిటీని 2ఏఎన్–బీ నుంచి 3ఏఎన్–బీకి ఇప్పటికే ప్రభుత్వం పెంచేసింది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి.. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక మొత్తంలో కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెడుతోంది.
మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించి.. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి 8 శాతం తొలి విడత కమీషన్‌గా వసూలు చేసుకుంటున్నారు. తాజాగా బిడ్ కెపాసిటీని మరోసారి పెంచి పదేళ్ల వ్యవధిలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల విలువను పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించారు. సన్నిహిత కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో పనులు అప్పగించడానికే బిడ్ కెపాసిటీని మరోసారి సవరించినట్లు స్పష్టమవుతోంది.