డీజీపీకి హైకోర్టు ఆదేశం
ఏడాదిలో 224 మంది మిస్సయినట్లు వెల్లడించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా, తుని మండలం, సీహెచ్ అగ్రహారం గ్రామంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన వ్యవహారంపై దృష్టిసారించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తాను ఆదేశించింది. చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుసుకోవాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు అమలుచేయడంలేదని, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది జి. శ్రీకాంత్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు.
దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కాగా, ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నా యని తెలిపారు.
మొత్తం మిస్సింగ్ వివరాలు తెలియజేస్తూ, గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,508 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 4,284 మంది ఆచూకీ తెలుసుకోగలిగామన్నారు. మిగిలిన 224 మంది ఆచూకీ లభించలేదన్నారు. ఈ వివరాలతో అఫిడవిట్ను దాఖలు చేశామని ధర్మాసనానికి నివేదించారు.


