స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక ఎన్నికలు | State Election Commissioner Punetha addresses the media on local elections | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

Oct 15 2026 2:40 AM | Updated on Oct 15 2026 2:40 AM

State Election Commissioner Punetha addresses the media on local elections

రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సహకారం కూడా అవసరం  

తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి  

అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశం  

దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో కులధ్రువీకరణ, నోడ్యూస్‌ పత్రాలు ఇవ్వాలి  

మీడియాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠ  

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ చెప్పారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్టు ప్రకటించారు.

కోడ్‌ సమయంలో ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి పథకాలను, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేయకూడదని చెప్పారు. బ్యానర్ల ఏర్పాటు, విగ్రహాల విషయంలో పలు నియంత్రణలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు. కోడ్‌ కాలంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీ ఉండవని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలను పట్టిషంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్టు వెల్లడించారు.   

ఆన్‌లైన్‌ నామినేషన్లకు ఇప్పుడు సమయం లేదు  
నామినేషన్‌ వేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని జిల్లా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆయా ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు పోటీచేయడంలో ఏ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమయ్యే కులధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు చేసిన 24 గంటల్లో జారీచేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించినట్లు చెప్పారు. 

నోడ్యూస్‌ పత్రాలను కూడా 24 గంటలలోపే ఇవ్వాలని ఆదేశించామన్నారు. వీలైనంత మేర వాటిని అందజేస్తారన్నారు. పోలింగ్‌ జరిగే ప్రతి చోట సీసీటీవీల ఏర్పాటు ఖర్చుతో కూడిన ప్రక్రియ అని పేర్కొన్నారు. పోలీసుశాఖ  సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినచోట సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీ వినతుల మేరకు ఆ సీసీటీవీల పుటేజీ 60 రోజులు రిజర్వు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియమించే అబ్జర్వర్ల ద్వారా మద్యం నియంత్రణకు చర్యలు చేపడతామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ పటిష్టంగా అమలయ్యేలా అబ్జర్వర్లు చర్యలు చేపడతారని తెలిపారు.  

ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితాలు ఇస్తే వాటితోనే ఎన్నికలు  
కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలకు ముందస్తు కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో అక్టోబర్‌ నాటికి ఉన్న తాజా ఓటర్ల జాబితాలు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ జాబితాలను ఇస్తే కొత్త జాబితాలతోనే పోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్‌ సమయానికి కొత్త జాబితాలు తమకు అందని పక్షంలో ఇప్పటికే తమవద్ద ఉన్న పాత ఓటర్ల జాబితాల మేరకు పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి మల్లిఖార్జున మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, వినతుల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినతుల పరిష్కారానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ పోలింగ్‌ నిర్వహణకు 4,027 మంది ఎన్నికల అధికారులు, వెయ్యిమంది ఎన్నికల స్క్వాడ్, 72 వేలమందిని ఎన్నికల సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. పోలింగ్‌ రోజు మున్సిపల్‌ సిబ్బంది పోలింగ్‌ స్టేషన్‌లో కూర్చోకూడదన్న నిబంధన ఉందని తెలిపారు. పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నామినేషన్‌ డిపాజిట్‌లో 50 శాతం రాయితీ ఉంటుందని ఆయన చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement