నిబద్ధత, నిరంతర అధ్యయనంతోనే రాణింపు | Chief Justice Lisa Gill addresses young lawyers | Sakshi
Sakshi News home page

నిబద్ధత, నిరంతర అధ్యయనంతోనే రాణింపు

Oct 15 2026 2:54 AM | Updated on Oct 15 2026 2:54 AM

Chief Justice Lisa Gill addresses young lawyers

వృత్తిలో రాణించేందుకు దగ్గరి దారులు ఉండవు 

సీనియర్‌ న్యాయవాదుల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు 

యువ న్యాయవాదులకు సీజే జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తులు జస్టిస్‌ దేవానంద్, జస్టిస్‌ రవి ఉద్బోధ

సాక్షి, అమరావతి: న్యాయవాద వృత్తిలో రాణించేందుకు దగ్గరి దార్లు ఏవీ ఉండవని, నిబద్ధత, నిరంతర అధ్యయనంతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ చీమలపాటి రవి యువ న్యాయవాదులకు ఉద్బోధించారు.హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌ఎఏ) బుధవారం యువ న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకునే విషయంలో అవగాహన (ఓరియంటేషన్‌) కార్యక్రమాన్ని నిర్వహించింది.  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్‌.. జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ చీమలపాటి రవి  ఈ సందర్భంగా  యువ న్యాయవాదులతో తమ అనుభవాలను పంచుకున్నారు.

‘కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలన చేయాలి. కోర్టులో ఎలా వ్యవహరించాలి.. ఎలా వాదించాలి.. వాదనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఎక్కడ తగ్గాలి.. వంటి విషయాలు ఎవరూ.. ఎక్కడా నేర్పరు.  వాటిని కోర్టు హాళ్లలోనే పరిశీలన ద్వారానే నేర్చుకోవాలి. న్యాయస్థానాల్లో సీనియర్‌ న్యాయవాదుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఖాళీ సమయం ఉన్నప్పుడు ఇతర న్యాయవాదులు ముఖ్యంగా సీనియర్‌ న్యాయవాదులు చేసే వాదనలను గమనించాలి.  మేమూ అలా నేర్చుకునే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం’ అని 
వివరించారు.    

క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు 
న్యాయవాదుల సంఘం ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ (ఏఏజీ) సాంబశివప్రతాప్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) తేనేపల్లి నిరంజన్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు యువ న్యాయవాదులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement