మున్నేరు వాగు ఘటన: నలుగురు మృతదేహలు లభ్యం

Five Kids Missing in Krishna District Eturu Munneru area - Sakshi

కృష్ణాజిల్లా ఏటూరు మునేరులో ఘటన 

అర్ధరాత్రి వరకూ గాలింపు

శోక సంద్రంలో తల్లిదండ్రులు 

చందర్లపాడు: వంట కోసం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఉదయం వెళ్లిన వారు చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి ఆరా తీసిన తల్లిదండ్రులకు తమ పిల్లలు ఏటి దగ్గరకి వెళ్లినట్లు తెలిసి ఆందోళన చెందారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూసేసరికి ఏటొడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు, సైకిళ్లు మాత్రమే కనిపించాయి. ఎంత వెతికినా వారి జాడ తెలియకపోవడంతో నీళ్లలో గల్లంతై ఉంటారని భావించి గాలింపు ప్రారంభించారు.

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్‌ (11), కర్ల బాలయేసు (12), జట్టీ అజయ్‌ (12), గురజాల చరణ్‌ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇళ్ల వద్దే ఉన్న వీరు పుల్లలు తీసుకొద్దామని సైకిళ్లపై బయల్దేరారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. పిల్లలు మునేరు దగ్గరకి వెళ్లినట్లు పశువుల కాపరులు సమాచారమిచ్చారు. చుట్టుపక్కల  వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపారు.

నందిగామ రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్, చందర్లపాడు ఎస్‌ఐ రామకృష్ణ, తహసీల్దార్‌ సుశీలాదేవి గాలింపు చర్యలు చేపట్టారు. పల్లెకారులు, గజ ఈతగాళ్లు, గ్రామస్తులు నదిలో పడవల సాయంతో రాత్రివేళ వెతుకులాట ప్రారంభించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ఘటనా స్థలికి చేరుకుని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాత్రి 11 గంటలైన పిల్లల ఆచూకీ లభ్యంకాలేదు. ముక్కుపచ్చలారని  చిన్నారులు మునేరులో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. 

నలుగురు చిన్నారుల మృతదేహలు లభ్యం

నీటిలో పడి మునిగిపోయిన ఐదుగురు చిన్నారులలో నలుగురు మృతదేహలు లభ్యమయ్యాయి. మరో యువకుడి మృతదేహం కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top