తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం | The first result is Kovvur and Narasapuram | Sakshi
Sakshi News home page

తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం

May 31 2024 5:50 AM | Updated on May 31 2024 7:35 AM

The first result is Kovvur and Narasapuram

ఈ రెండుచోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి

రంపచోడవరం, చంద్రగిరిలలో ఆలస్యంగా లెక్కింపు పూర్తి 

ఈ రెండు నియోజకవర్గాల్లో 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు 

భీమిలి, పాణ్యం ఫలితాల కోసం రాత్రి వరకు వేచిచూడాల్సిందే 

ఇక్కడ 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు  

సాక్షి, అమరావతి:  వచ్చే జూన్‌ 4న కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుండగా.. మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచిచూడాల్సి ఉంటుంది. పోలైన ఓట్లు, కౌంటింగ్‌ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్లను నిర్ధారించింది.

దీని ప్రకారం.. రాష్ట్రంలో అన్నింటికంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. 

ఇదే సమయంలో రంపచోడవరం (ఎస్టీ), చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 


 
111 చోట్ల 20, అంత కంటే తక్కువ రౌండ్లలోనే పూర్తి 
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ప్రకారం.. కౌంటింగ్‌ హాళ్లల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement