హజ్‌ యాత్రకు జూన్‌ 7న తొలి విమానం

First flight for Hajj on 7th June - Sakshi

విజయవాడలో ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఏర్పాటు

రోజుకు 155 మంది హజీల పయనం

సాక్షి, అమరావతి: ఏపీకి చెందిన హజ్‌ యాత్రికులు ఈ­సారి విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి ప్ర­యాణం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేసిన కృషి ఫలించడంతో విజయవాడలో ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఏర్పాటైంది. దీంతో హజ్‌ యాత్రకు శ్రీకారం చుడుతూ జూన్‌ 7 న విజయవాడ నుంచి తొలి విమానం ఎగరనుంది. రోజుకు 155 మంది హజీలు విజయవాడ నుంచి వెళ్లనున్నారు.

ఒక్కో బృందం 41 రోజుల పాటు హజ్‌ యాత్రను చేపట్టనుంది. ఏపీ నుంచి హజ్‌ యాత్రకు 2,116 మంది ఎంపికవ్వగా వీరిలో 1,115 మంది పురుషులు..1,001 మంది మహిళలున్నారు. కాగా, విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 1,814 మంది వెళ్తున్నారు. అనంతపురం, చి­త్తూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు చెందిన హజీలు బెంగళూరు నుంచి వెళతారు.

కృష్ణా, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్‌ కడప తదితర జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్‌ నుంచి వెళ్లనున్నారు. హజ్‌ యాత్రను విజయవంతం చేసేలా ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినే­షన్‌ పూర్తి చేసి యాత్రకు మార్గదర్శకాలను హజీలకు అందజేసింది. విజయవాడ–గుంటూరు ఎన్‌హెచ్‌లోని నంబూరు వద్ద మదరసాలో బస ఏర్పాట్లు చేసి భోజన, వసతి, రవాణా వంటి విభాగాల వారీగా కమిటీలను వేసి యాత్ర విజయవంతానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఒక్కో హజీకి రూ.3.8 లక్షల ఖర్చు  
హజ్‌–2023కు దేశంలో 22 ఎంబార్కేషన్‌ పాయింట్‌లు ఉండగా వాటి నుంచి వెళ్లే హజీలు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందన్నది కేంద్ర హజ్‌ కమిటీ నిర్ణయించింది. వాటిలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ల  నుంచి వెళ్లే వారికే తక్కువ ఖర్చు కానుంది. వాటితో పోల్చితే విజయవాడతో పాటు మరో 9 ఎంబార్కేషన్‌ పాయింట్ల నుంచి వెళ్లేవారిపై అదనపు భారం పడుతోంది.

కాగా, ఒక్కొక్క హజీకి విజయవాడ నుంచి రూ.3,88,580 గా ఖర్చును కేంద్ర హజ్‌ కమిటీ నిర్ణయించింది. ఏపీ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లేవారిపై పడుతోన్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తెలిసిన వెంటనే సీఎం జగన్‌ ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌  అజామ్‌లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతిఇరానీ, కేంద్ర హజ్‌ కమిటీని సంప్రదించారు.

విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి వెళ్లే వారిపై అదనపు భారం తగ్గించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే హజీలపై పడుతోన్న అదనపు ఖర్చుల భారం రూ.14.51 కోట్లను విడుదల చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top