పిట్టల వేమవరంలో విచారణ చేస్తున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్
మద్యానికి బానిసై రెండేళ్లుగా కుమార్తెపై లైంగిక దాడి
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
పశ్చిమ గోదావరి జిల్లా: కన్నతండ్రే కూతురిపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం బయటపెడితే తాను పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించాడు. పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామంలో ఈ దారుణం జరుగగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. నిందితుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్లుగా పెద్ద కుమార్తెను బెదిరిస్తూ అఘాయిత్యం చేస్తుండగా ఇటీవల కుమార్తెలో మార్పు రావటంతో తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది.
అక్కడ పరీక్షల్లో కుమార్తె గర్భ నిరోధక మాత్రలు వాడినట్లు తేలటంతో ఇంటికి వచ్చి కుమార్తెను నిలదీయగా తండ్రే ఈ దురాగతానికి పాల్పడినట్లు చెప్పింది. దీనితో భర్తను నిలదీయగా ఈ విషయం బయట చెబితే తాను పురుగు మందు తాగుతానని బెదిరించాడు. నువ్వు చచ్చినా ఫర్వాలేదు అని చెప్పి ఆమె కుమార్తెలతో సహా ఈ నెల 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విషయం ఎక్కడ బయటపడుతోందనని డ్రైవర్ పురుగు మందు తాగాడు. స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతుర్లతో సహా పుట్టింటికి వెళ్లిన నిందితుడి భార్య ఈ నెల 15వ తేదీన పెనుమంట్ర పోలీసులను ఆశ్రయించింది. అక్కడ జీరో ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి పెరవలి పోలీసు స్టేషన్‌కు 16వ తేదీన పంపించారు.
దీంతో ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితుడు ఆసుపత్రి నుంచే పరారీ అయ్యాడని అధికారులు చెబుతున్నారు. భార్య, బాధిత బాలిక, నాన్నమ్మ, చుట్టుపక్కల కుటుంబాలను డీఎస్పీ దేవకుమార్ విచారించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, మద్యానికి బానిసైన అతను కుటుంబ సభ్యులను రోజూ ఏదో రకంగా బాధపెడుతూ, చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.


