వెన్నలాంటి మనసుండే ‘నాన్న’ కన్నపిల్లల పాలిట ఇంత కర్కశంగా ప్రవర్తించడమేమిటి? వేలు పట్టి నడిపించడానికి బదులు మెడపట్టి నదిలోకి గెంటేయడమేమిటì ? ఒక జీవితకాలం భరోసా ఇవ్వాల్సిన తండ్రే జీవితాన్ని చిదిమేయడమేమిటి? నాన్నతనానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనలు మానవత్వాన్ని ఎగతాళి చేశాయి.
మలికిపురం: తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచవలసిన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు వారిని ఎందుకు చంపాలను కున్నాడో అర్థంకాక జనం ఆశ్చర్యపోతున్నారు. తాను చని పోవడంతో పాటు అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులను గోదావరిలోకి నెట్టేయడం పలువురిని కలచివేసింది. రెండు గ్రామాల్లో విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి శిరిగినీడి దుర్గాప్రసాద్ (38) తన ఇద్దరు సంతానాన్ని సోమవారం సాయంత్రం దిండి – చించినాడ వంతెన పై నుంచి నదిలోకి తోసి తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు గాలించగా దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్(14) మృతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. కుమార్తె జాహ్నవి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
రెండు గ్రామాలలో విషాదం
రోజూ పాఠశాలలకు అందరితో కలిసి ఎంతో సరదాగా వెళ్లే ఆ చిన్నారులు గోదావరిలో పడిపోయారనే దుర్వార్త రెండు గ్రామాలలో పెను విషాదం నింపింది. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, పక్కనే ఉన్న విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన రేకపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు, బంధువులు చెబుతున్నారు. పక్కపక్క గ్రామాలు కావడంతో అత్తింటి వద్ద, పుట్టింటి వద్ద కూడా భార్యాభర్తలు, పిల్లలు ఉండేవారు. కుమారుడు మోహిత్ తొమ్మిదో తరగతి, కుమార్తె జాహ్నవి నాలుగో తరగతి చదువుతున్నారు.
పలు అనుమానాలు
దుర్గాప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అతను ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదా? లేక తాను ఎక్కడైనా తెచ్చిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోవడానికి ముందు రోజు కూడా అత్త వారింటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. సోమవారం సాయంత్రం ఆధార్ కార్డుల అప్‌డేట్ అంటూ చిన్నారులను బైక్‌పై తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ దిండి– చించినాడ వంతెనపై బైక్, సెల్‌ఫోన్, పర్సు ఉంచి పిల్లలను నదిలో తోసేసి తాను కూడా దూకేశాడు. కారణాలు తెలియనప్పటికీ ఇద్దరు చిన్నారులను చంపాలనుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై రాజోలు సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక విచారణ చేశామని, కుటుంబ కలహాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు.


