ఎరువు కరువు | Farmers wait for hours for fertilizer | Sakshi
Sakshi News home page

ఎరువు కరువు

Jul 17 2025 5:40 AM | Updated on Jul 17 2025 5:40 AM

Farmers wait for hours for fertilizer

గంటల తరబడి రైతుల పడిగాపులు 

2019కి ముందు మాదిరిగా మళ్లీ క్యూ లైన్లు 

సరిపడా నిల్వల్లేక అన్నదాతల అగచాట్లు

సాక్షి, అమరావతి: ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. కూటమి ప్రభుత్వం పుణ్యమాని ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే రైతులు ఎరువుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. సొసైటీ కేంద్రానికి ఎరువులు వస్తున్నాయని తెలియడం ఆలస్యం.. వ్యవసాయ పనులు మానుకుని గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. కొన్ని జిల్లాల్లో గతంలో మాదిరిగా చెప్పులు, సంచులను వరుసలో పెట్టి ఎదురుచూపులు చూస్తున్నారు. 

రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న నిల్వలకు పొంతన లేకుండా ఉంది. రైతు సేవా కేంద్రాలకే కాదు.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ కేంద్రాలకు సైతం అరకొరగా కేటాయిస్తుండడంతో క్షేత్ర స్థాయిలో కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు ఎమ్మార్పీకి మించి అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరం లేకున్నా పురుగు మందులను బలవంతంగా అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

పొంతన లేని ఎరువుల లెక్కలు
రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 85.26 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, పట్టుమని 12 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగవలేదు. సీజన్‌ ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షాభావ పరిస్థితులతో సాగు ఊపందుకోలేదు. 

» గతంలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు 19 లక్షల టన్నుల ఎరువులు కేటాయించేవారు. అయితే, 2024–25లో 17.50 లక్షల టన్నులకు, 2025–26లో 16.76 లక్షల టన్నులకు కుదించారు. ప్రారంభ నిల్వలతో కలిపి 13.56 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గత 45 రోజుల్లో 4.89 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 8.66 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏటా 1.50 లక్షల టన్నులు బఫర్‌ స్టాక్‌ రూపంలో నిల్వ చేసి డిమాండ్‌ మేరకు పీఏసీఎస్‌లు, ఆర్‌ఎస్‌కేలు, డీసీఎంఎస్‌ల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేవారు. బఫర్‌ స్టాక్‌ కేటాయింపులను ఈ ఏడాది నుంచి 2 లక్షల టన్నులకు పెంచినట్టుగా గొప్పలు చెప్పుకొన్నారు. క్షేత్ర స్థాయిలో చూద్దామంటే ఎరువు కట్ట కూడా కనిపించడం లేదు. రైతు సేవా కేంద్రాలకే కాదు సొసైటీలు, డీసీఎంఎస్‌ కేంద్రాల్లో సైతం డిమాండ్‌కు సరిపడా నిల్వల్లేక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.

80 శాతం ఎరువులు.. ఎమ్మార్పీకి మించి విక్రయాలు
జిల్లాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో 70–80 శాతం ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు. సొసైటీలు, డీసీఎంఎస్‌లకు అరకొరగా ఇస్తుండడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాట­గా సాగుతోంది. యూరియా, డీఏపీ ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పైగా ఎమ్మార్పీకి తాము చెప్పినంత ధర ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. కారణం ర్యాక్‌ల నుంచి రిటైల్, హోల్‌సేల్‌ దుకాణాలకు తీసుకొ­చ్చేందుకు రవాణా ఖర్చులు తడిసి మోపె­డవుతున్నాయని చెబుతున్నారు. 

యూరి­యా బస్తా ధర రూ.266.50 కాగా, బహిరంగ మార్కెట్‌లో రూ.­350–రూ.450 వరకు విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా రూ.1,350 కాగా, బహిరంగ మార్కెట్‌లో రూ.1,450 నుంచి రూ.1,500 మధ్య విక్రయిస్తున్నారు. మిగిలిన ఎరువులు కూడా ఎమ్మార్పీపై రూ.50–100 వరకు అదనంగా వసూలు చేస్తున్నా­రు. పెద్దగా డిమాండ్‌ లేని, రైతులకు అవసరం లే­ని ఎరువులను రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. డీఏపీ కట్ట కావా­లా? అయితే మి­శ్ర­మ ఎరువులు తీసుకోండి అంటూ మెలికపెడుతున్నారు. 

భారంగా మారిన ఎరువుల ధరలు
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎరువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. యూరియా, డీఏపీ, 28–28–0 ఎరువులు మినహా మిగతావాటి ధరలన్నీ భారీగా పెరిగాయి. సగటున బస్తాకు రూ.50–రూ.330 మేర పెరిగాయి. అత్యధికంగా 10–26–26 ఎరువు బస్తా (50 కిలోల) ధర రూ.1,470 నుంచి రూ.1,800కు పెరిగింది. పొటాష్‌ (50 కిలోల) ధర రూ.1,535 నుంచి రూ.1,800 కావడం రైతులకు పెనుభారంగా మారింది.

మరోవైపు చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో డ్రిప్‌ ఎరువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే 25–60 శాతం మేర పెరిగాయి. ఎంఏపీ, ఎంకేపీ ఎరువులు ధరలు సైతం కిలోకు రూ.60–80, ఫె–ఈడీడీహెచ్‌ఏ (ఐరెన్‌ చెలేట్‌) వంటి సూక్ష్మ ఎరువుల ధరలు కిలో‡ రూ.280–రూ.320 ఉండగా, వీటి ధరలు రూ.500 నుంచి రూ.600కు, జెడ్‌ఎన్‌–ఏడీటీఏ అనే జింక్‌ ఎరువుల ధరలు కిలో రూ.150–180 ఉండగా, రూ.280 నుంచి రూ.350కు పెరిగాయని చెబుతున్నారు. ఉద్యాన పంటల సాగులో కీలక భూమిక పోషించే సూక్ష్మ పోషక ఎరువులు (మైక్రో న్యూట్రియెంట్స్‌) కొరత తీవ్రంగా ఉంది.

ఆర్‌ఎస్‌కేల్లో కానరాని వైనం..
రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కొరత వేధిస్తోంది. 2020 మే 30న ఆర్బీకేలు ఏర్పాటవగా, 2023–24 సీజన్‌ వరకు ఏనాడూ గ్రామ స్థాయిలో లోటు తలెత్తలేదు. సొసైటీలకు ప్రాధాన్యమిసూ్తనే ఆర్బీకేలకు ఏటా నిల్వలు పెంచుతూ వెళ్లారు. ఏటా సగటున 8.53 లక్షలమందికి 3.26 లక్షల ట­న్నుల చొప్పున నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మందికి 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. 2024–25 సీజన్‌లో 10 ల­క్షల టన్నుల ఎరువులు నిల్వ చేయాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా, గతేడాది అతికష్టమ్మీద లక్ష టన్నులకు మించి సరఫరా చే­య­లేకపోయారు. 

కానీ, ఈ ఏడాది మరీ ఘో­రం. ఆర్‌ఎస్‌కేలకు మొక్కుబడి కేటాయింపులతోనే సరి­పె­డుతున్నారు. జిల్లాల పరిధిలోని ఆర్‌ఎస్‌కేల్లో కనీసం 10 శాతం కేంద్రాలకు కూడా కేటాయింపులు జరపడం లేదు. అది కూడా రేషన్‌ బియ్యం మాదిరిగా బస్తా లెక్కన సరఫరా చేస్తున్నారు. ఆర్‌ఎస్‌కేల్లోనే కాదు.. సొసైటీలు, డీసీఎంఎస్‌లకు కేటాయించే ఎరువులను  కూటమి నేతలు సిఫా­ర్సు­ల మేరకు ఇస్తున్నారు. రాష్ట్రంలో 8.66 లక్షల టన్నుల ఎరువులున్నాయని చెబుతుండగా, ఆర్‌ఎస్‌కేల్లో మాత్రం 14 వేల టన్నులకు మించి నిల్వల్లేవు. వాటిలో యూరియా 8 వేలు, డీఏపీ 5 వేల టన్నులే ఉన్నాయి. 

ఇక కాంప్లెక్స్‌ ఎరువులు వెయ్యి టన్నులు, ఎంవోపీ 400 టన్నులు, ఎస్‌ఎస్‌పీ కేవలం 40 టన్నులు మాత్రమే ఆర్‌ఎస్‌కేల్లో ఉన్నాయి. ఎరువుల సరఫరాలో వికేంద్రీకరణ విధానం పాటించాలని, ఆర్‌ఎస్‌కేలకు కూడా స్థానిక డిమాండ్‌ మేరకు తగినంత కేటాయింపులు జరపాలని జిల్లా కలెక్టర్లు ప్రతిపాదిస్తున్నా ఆర్‌ఎస్‌కేల ప్రాధాన్యం తగ్గించాలన్న కుట్రలో భాగంగా వాటికి  ప్రభుత్వం కేటాయింపులు జరపడంలేదు. 

నాలుగేళ్లు.. కానరాని క్యూలైన్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2019–24 మధ్యన.. ఆర్‌బీకేల  ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరç­œరా చేశారు. గ్రామంలోనే ఎరువులు లభించడంతో రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌ రూపంలో రూ.100 కోట్ల వరకు రైతులకు ఆదా అయింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చొ­వాల్సిన బాధ తప్పింది. బ్లాక్‌ మార్కెట్‌ బెడద లేకుండా పోయింది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ గత ఏడాదిగా సొసైటీలు, డీసీఎంఎస్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 

2019కి ముందు కనీసం నాలుగైదుసార్లు తిరిగితే కానీ ఎరువులు దొరికేవి కావు. మండల స్థాయిలో జరిగే పంపిణీ వల్ల రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. వెళ్లిన ప్రతిసారి దూరా­భారాన్ని బట్టి తక్కువలో తక్కువ రూ.100 ఖర్చ­య్యేవి. భోజనసాదర్లు మరో రూ.50. ఎరువుల కట్ట (బస్తా) గ్రామానికి తెచ్చేందుకు  రూ.20–30. డిమాండ్‌ చేసిన ధర ముట్టజెప్పడంతో పాటు అవసరం ఉన్నా లేకున్నా డీలర్‌ అంటగట్టే పురుగు మందులు కొంటే కానీ.. ఎరువుల కట్ట చేతికొచ్చేది కాదు. 

ఎక్కడికెళ్లినా విత్తనాల కోసం చెప్పుల క్యూ కన్పించేవి. మండుటెండలో నిల్చొని స్పృహ తప్పిపడిపోవడం, వడగాడ్పుల బారినపడి మత్యువాత పడడం అప్పట్లో  సాధారణంగా కనిపించేది. బ్లాక్‌ మార్కెట్‌లో ఎమ్మార్పీకి మించి ముట్టజెబితే కానీ ఎరువులు దొరికే పరిస్థితి ఉండేది కాదు. రైతులు మళ్లీ ఇప్పుడు ఇవే అవస్థలు పడుతున్నారు. 

యూరియా కొరత తీవ్రంగా ఉంది..
ఖరీఫ్‌ సీజన్‌ వచ్చి మూడు వారాలు కావస్తోంది. వరి నా­ట్లు వేసే సమయానికి వేయాల్సిన ఎరువులు లేకపోవడంతో ఇబ్బందులు ప­డు­తున్నాం. డీఏపీ రైతు సేవా కేంద్రాల ద్వా­రా పంపిణీ చేస్తున్నప్పటికీ, యూరియా కొర­త తీవ్రంగా ఉంది. డీఏపీపాటు ఖరీఫ్‌ సీజన్‌లో వరి, పత్తి, చెరకు పంటలకు ఉపయోగించే యూరియాను పంపిణీ చేయాలి.  – రెడ్డి తవిటినాయడు,  రామవరం, సీతానగరం మండలం 

పదహేను రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా
నాకు ఐదెకరాల పొలం ఉంది.మొక్కజొన్న పంటను సాగు చేశాను.  పంట పెరుగుదలకు యూరియా అవసరం.15 రోజులుగా గ్రామంలోని రైతు సేవా కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా. ఇప్పటికీ యూరియా లభించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌బీకేలో డబ్బు కట్టిన వెంటనే ఎరువులు, పురుగు మందులు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.    – నాగేంద్ర, రైతు, బసంపల్లి, శెట్టూరు మండలం, అనంతపురం జిల్లా

యూరియా ఎక్కడ?
సోమశిల: యూరియా కోసం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు రోడ్డె­క్కారు.అనంతసాగరం సొసైటీ ఎదుట రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించారు. సొసైటీలో యూరియా స్టాక్‌ ఉందనే సమాచారంతో బుధ­వారం ఉదయం 7 గంటలకు పెద్ద ఎత్తున రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సొసైటీలో రెండు లోడుల కన్నా ఎక్కువగా యూరియా స్టాక్‌ ఉన్నప్పటికీ రైతులను చూసి సొసైటీ సిబ్బంది గేట్లు తీయలేదు. 

రైతులు అధికంగా ఉన్నారని, గొడవలు తలెత్తుతాయని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని యూరియాను అందిస్తామని వెళ్లిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 200 మంది రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో మండల వ్యవసాయాధికారులు సొసైటీ వద్దకు చేరుకుని రైతులకు యూరియాను పంపిణీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement