
రావెలలో భూములివ్వబోమని ఎమ్మెల్యేకు అర్జీ ఇస్తున్న రైతులు
రాజధాని భూ సమీకరణ గ్రామ సభల్లో రైతుల మండిపాటు
భూములిచ్చేది లేదని గ్రామసభల్లో తేల్చి చెప్పిన అన్నదాతలు
గతంలో భూములిచ్చిన రైతులకే దిక్కులేదు.. మాకేం న్యాయం చేస్తారని నిలదీత
ఉచిత విద్య, వైద్యం అంటున్నారు.. ఇక్కడి వర్సిటీల్లో ఏడాదికి రూ.7 లక్షలు ఫీజు అడుగుతున్నారు
టీడీపీ నాయకుల కనుసన్నల్లో గ్రామ సభలు
రైతుల అభిప్రాయం, సంతకాలు లేకుండానే అంగీకరించినట్లు తీర్మానం చేసే ప్రయత్నం
తాడికొండ: ‘ఇంతకు ముందు భూములిచ్చిన రైతులకే న్యాయం జరగలేదు. వాళ్లకిచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడంలేదు. పన్నెండేళ్ల క్రితం భూములు ఇచ్చిన వాళ్లకే దిక్కులేనప్పుడు మాకెలా న్యాయం జరుగుతుంది? మా జోలికెలా వస్తారు’ అంటూ రాజధాని రెండో దశ భూ సమీకరణకు అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభలలో అన్నదాతలు విరుచుకుపడ్డారు. మీకు భూములిస్తే మేం అడుక్కు తినాల్సిందేనని అన్నారు. మీరిచ్చే రూ. 30 వేల కౌలు దేనికి సరిపోతుందని నిలదీశారు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం తినాలని ప్రశ్నించారు.
ఉచిత విద్య, వైద్యం అంటున్నారని, రైతుల పొట్టకొట్టి పెట్టిన విద్యా సంస్థల్లో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఎల్‌కేజీకి రూ.30 వేలు ఫీజులు చెల్లించాలని, ఇక విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి యూనివర్శిటీల్లో ఏడాదికి రూ.7 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారని చెప్పారు. భూములిచ్చిన మాకు ఏం న్యాయం చేసినట్టు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాడికొండ మండలం పాములపాడు, బేజాత్పురం , రావెల గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎదుటే భూములివ్వబోమని తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో పరిమితికి మించి భూములు తీసుకుంటే మా పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు.
బేజాత్పురంలో రైతులపై టీడీపీ నేతల దుర్మార్గం
బేజాత్పురం గ్రామ సభలో భూములివ్వబోమని మెజార్టీ రైతులు తేల్చిచెప్పారు. ఆ రైతులతో టీడీపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. అయినా భూములను ఇచ్చేది లేదని రైతులు కుండ బద్దలు కొట్టారు. రావెల గ్రామంలో పూలింగ్‌కు భూములు ఇవ్వబోమంటూ రైతులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. 12 ఏళ్ల క్రితం ఇచ్చిన వారికే దిక్కు లేదని, మిమ్మల్ని నమ్మి భూములిస్తే అడుక్కు తినాల్సి వస్తుందని అన్నారు. 2016లో రుణ మాఫీ చేస్తానని ఇచ్చిన బాండ్ చూపించి, ఇది అమలు చేయలేదు, మళ్ళీ ఎలా నమ్మాలని ఓ రైతు గట్టిగా నిలదీశారు.
ముందుగా చేసిన సంతకాలతో టీడీపీ నేతల అంగీకార పత్రాలు
గ్రామ సభల్లో టీడీపీ నాయకులు ఒకే తరహా అంగీకారపత్రాలు ఇచ్చారు. ఒకే నమూనా పత్రం ప్రింట్ చేయించి, కేవలం గ్రామం పేరు మాత్రమే మార్చి, ముందుగానే కొందరితో సంతకాలు చేయించారు. వాటినే ఎమ్మెల్యే చేతికిచ్చి అంగీకారం అంటూ చదివి వినిపిస్తున్నారు.
నోటిఫికేషన్ ప్రకారం భూమి సరిపోయింది.. మళ్లీ ఎందుకు?
ప్రభుత్వం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రకారం తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల రైతులకు ఉన్న భూమి 45 వేల ఎకరాలు సరిపోయింది కదా ఇప్పుడు అదనంగా భూములు ఎందుకు సమీకరిస్తున్నారని ఓ రైతు గట్టిగా ప్రశ్నించారు. దీనికి అధికారులు, ఎమ్మెల్యే సమాధానం దాటవేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్డీవో శ్రీనివాసరావు బదులిస్తూ.. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వచ్చేమో అని అనడంతో భూ సమీకరణపై రైతుల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ గ్రామ సభల్లో సర్పంచ్ రావెల శైలజ, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ మెహర్ కుమార్, ఎంపీడీవో కె సమతావాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.