సంప్రదాయ సేద్యం వైపు రైతులు..!

Farmers Look The Side Of Conventional Farming - Sakshi

ఏటా పెరుగుతున్న   ‘ప్రకృతి’ సాగు విస్తీర్ణం

జిల్లాలో 128 గ్రామాల్లో ప్రకృతి  వ్యవసాయం

ఈ ఏడాది మరో 27 గ్రామాల్లో  కూరగాయలు, పండ్ల తోటల్లోనూ  ప్రకృతి సాగు

రసాయనిక, పురుగు మందుల  వాడకం నిషేధం

రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుతో మరింత ఉత్సాహం

వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న నాణ్యతలు.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ధరలు కూడా ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. సహజ సిద్ధ పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. సాగులో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో ఆ దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. దీంతో ఏటా జిల్లాలో ప్రకృతి సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. 

ఆత్మకూరురూరల్‌: రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా దశాబ్దకాలంగా సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్న మెట్ట రైతులు పంటల దిగుబడిలోనే గాకుండా తమ భూములను సారవంతం చేస్తూ వ్యవసాయ రంగంలో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం మహిమలూరులో తొలుత సహజ సేద్యం ప్రారంభమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో జిల్లాలో ప్రతి మండలంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గోమూత్రం, వివిధ రకాల చెట్ల ఆకులు తదితరాల మిశ్రమాన్ని మగ్గబెట్టడం ద్వారా తయారయ్యే కషాయాలను పంటలకు తగు మోతాదులో అందజేస్తూ ఆశించిన ఫలితాలు రాబడుతున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం  
ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టడంతో జిల్లాలోని రైతులు అన్ని మండలాల్లో ఈ విధానానికి ఆకర్షితులయ్యారు. ఒక్కో మండలంలో ప్రకృతి వ్యవసాయ ప్రధాన గ్రామాన్ని ఎంపిక చేసి సాగును ప్రారంభించారు. తొలి విడతలో 26గ్రామాలు, 2వ విడతలో 14, 3వ విడతలో 20, 4వ విడతలో 46, ఐదో విడతలో 22 ప్రకృతి వ్యవసాయ అధ్యాయన గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. జిల్లాలో మరో 27 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసేందుకు ప్రాథమిక ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ఏడో విడతలో జర్మనీ నిధులతో ప్రత్యేక ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పలు రకాల పంటల సాగు 
ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, పిండి పదార్థాలు తదితర రకాలను అంతర పంటలుగా మిశ్రమ పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. భూమిని పచ్చగా ఉంచడం ద్వారా భూసారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చనే మూల సిద్ధాంతాన్ని రైతులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. పత్తి, వరి, మామిడి, మినుములు, పెసర, తదితర పంటల సాగుతో పాటు 9 నుంచి 18 రకాలను ఏకకాలంలో పీఎండీఎస్‌ (ప్రీ మాన్‌సోన్‌ డ్రై సోయింగ్‌) విధానంలో పంటల సాగు చేపట్టడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.  

మిశ్రమ పంటలతో మెరుగైన ఫలితాలు
ప్రకృతి వ్యవసాయ పద్ధతు మిశ్రమ పంటలు సాగు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు భూమి సేంద్రియ పద్ధతుల్లో సారవంతం చేసుకోవడానికి ప్రకృతి వ్యవసాయం బలమైన చేయూతనిస్తోంది. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని స్థిరమైన ఆదాయం పొందగలుగుతున్నాం.  
– ఇరగన శ్రీనివాసులు, రైతు, మహిమలూరు, ఆత్మకూరు మండలం 

ఖర్చులు సగానికి పైగా తగ్గింపు
ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగులో రైతులకు అయ్యే ఖర్చులను సగానికిపైగా తగ్గించగలుగుతున్నాం. ఈ పద్ధతిలో ఉత్పత్తి అయిన వరి, మినుము, పెసర, కూరగాయలు, రకరకాల పండ్లు, ఇప్పటి వరకు స్థానిక రైతులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఆయా పంట ఉత్పత్తులకు తగు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నాం. 
–  చంద్రశేఖర్, ఎస్‌డీఏ (సబ్‌ డివిజన్‌ యాంకర్‌), ఆత్మకూరు 

అంతర్‌ పంటల సాగుతో ఆదాయం
మా పొలాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నాం. అధికారుల సూచనలతో 18 రకాల చిరుధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు అంతర్‌ పంటలుగా సాగు చేసి ఆదాయం పొందుతున్నాం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్నాం. 
– చిరుమామిళ్ల రాధమ్మ, మహిళా రైతు, బసవరాజుపాళెం, ఆత్మకూరు మండలం 

జీవామృతంతో మేలైన విత్తన శుద్ధి
ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో తయారు చేస్తున్న జీవామృతంతో మేలైన విత్తనశుద్ధి ద్వారా పంట దిగుబడిలో ఆశాజనకమైన ఉత్పత్తులు పొందుతున్నాం. మేము సాగు చేసిన పత్తి పైరులో 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం పిచికారీ చేస్తున్నాం. పిండినల్లి, రసం పీల్చు పురుగు వంటి నివారణ కోసం నీమాస్త్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేసి సత్ఫలితాలు పొందుతున్నాం. 
– గాలి విజయలక్ష్మి, మహిళా రైతు, బసవరాజుపాళెం, ఆత్మకూరు మండలం  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top