చలిగాలుల జాడలేదు

Extreme cold winds are rare in this season - Sakshi

ఈ సీజన్‌లో కానరాని అతి శీతల గాలులు  

ఉత్తర, వాయవ్య గాలులకు తూర్పు, ఈశాన్య గాలుల బ్రేక్‌  

అందుకే చలి తీవ్రత లేదంటున్న నిపుణులు  

ఏటా విశాఖ ఏజెన్సీలో సున్నా డిగ్రీలకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు 

ఈ ఏడాది అక్కడ 6 డిగ్రీలకే పరిమితం  

త్వరలో నిష్క్రమించనున్న చలి

సాక్షి, విశాఖపట్నం: డిసెంబర్, జనవరి నెలల్లో ఎముకలు కొరికేస్తున్నట్టుగా చలి తీవ్రత ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈ శీతాకాలం సాదాసీదాగానే ప్రభావం చూపించిది తప్ప జనాన్ని గజగజలాడించ లేదు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు (సివియర్‌ హీట్‌æవేవ్స్‌) వీస్తుంటాయి. అదే శీతాకాలంలో కొన్ని రోజులు అతి శీతల గాలులు (సివియర్‌ కోల్డ్‌ వేవ్స్‌) వీచి గడ్డ కట్టించే చలికి కారణమవుతాయి. అలాంటి రోజుల్లో కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయి.

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లోని లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వంటిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా క్షీణిస్తాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5–6 డిగ్రీలకు దిగజారిపోతాయి. లంబసింగిలో అయితే ఏటా జనవరిలో ఏకంగా ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోతుంది. కానీ.. ఈ శీతాకాలం సీజన్‌ అందుకు భిన్నంగా సాగింది. ఈ సీజన్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ రోజులు 8–15 డిగ్రీల మధ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకంటే (చింతపల్లి, లంబసింగిల్లో) తక్కువగా రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదు. మన్యం సహా రాష్ట్రంలో ఒక్క రోజూ అతి శీతల గాలులు (కోల్డ్‌ వేవ్స్‌) వీయలేదు. శీతల తీవ్రత అధికంగా ఉండే జనవరిలోనూ చలి ప్రభా­వం అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందే అవసరం ఏర్పడ లేదు. గడచిన కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  

తూర్పు, ఈశాన్య గాలులే ఇందుకు కారణం 
సాధారణంగా శీతాకాలంలో దక్షిణాదికంటే ఉత్తర, వాయవ్య భారతదేశంలో శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటునుంచి మన రాష్ట్రం వైపు ఉత్తర, వాయవ్య గాలులు బలంగా వీస్తుంటాయి. దీంతో చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్‌పై కూడా కనిపిస్తుంది.

అయితే.. ఈ ఏడాది రాష్ట్రంపైకి తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. ఫలితంగా ఈ గాలులు ఉత్తర, వాయవ్య గాలులకు ఒకింత అడ్డుకట్ట వేశాయి. ఈ ఏడాది చలి తీవ్రత అంతగా లేకపోవడానికి, అతిశీతల గాలులు వీయకపోవడానికి తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికంగా ఉండటమే కారణమని భారత వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.  

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 
కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు 17–23 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. దీంతో చలి ప్రభావం ఏమంత ఉండటం లేదు. గతంలో ఫిబ్రవరి ఆరంభంలో ఇలాంటి పరిస్థితి లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇవి 30–35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో 10 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆపై చలి నిష్క్రమిస్తుందని పేర్కొంటున్నారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top