భారీగా పెరుగుతున్న ‘మేకిన్‌ ఇండియా’ బొమ్మల ఎగుమతులు.. ఏపీలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం

Exports of Maken India toys are booming - Sakshi

సాక్షి, అమరావతి:  దేశీయ బొమ్మల పరిశ్రమ దశ తిరిగింది. ఈ రంగం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం చిన్నపిల్లల ఆట వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్‌ ఇప్పుడు ఏకంగా ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటోంది. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో బొమ్మల ఎగుమతులు ఆరు రెట్లకు పైగా పెరిగాయి.

2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొమ్మల ఎగుమతులు రూ.167 కోట్లుగా ఉంటే అది 2021–22 నాటికి రూ.2,601 కోట్లకు చేరుకుంది. కానీ, దేశీయ ఎగుమతులు భారీగా పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో ఇది ఒక శాతంలోపే ఉంది.

ప్రస్తుతం అంతర్జాతీయ బొమ్మల ఎగుమతుల మార్కెట్‌ విలువ రూ.12,64,000 కోట్లుగా ఉంది. భారత్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక దేశీయ బొమ్మల ఎగుమతుల్లో 77 శాతం అమెరికాకే జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదే సమయంలో దేశంలో బొమ్మల దిగుమతులు భారీగా పడిపోయాయి. 2018–19లో భారత్‌ రూ.2,960 కోట్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకుంటే అది 2021–22 నాటికి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పరిమితమయ్యింది. ఇందులో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి.
 
‘వోకల్‌ ఫర్‌ లోకల్‌ టాయ్స్‌’తో సత్ఫలితాలు 
మరోవైపు..స్థానిక ఆట బొమ్మలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌ టాయ్స్‌’ విధానం సత్ఫలితాలిస్తోంది. దేశీయ ఆట బొమ్మల మార్కెట్‌ను ఎటువంటి ప్రమాణాల్లేని చైనా వస్తువులు ఆక్రమించడంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్థానిక చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు ప్రచారం కల్పిస్తూనే మరోపక్క దిగుమతులకు అడ్డుకట్ట పడే విధంగా వివిధ ఆంక్షలను విధించింది.

ముఖ్యంగా ఆటబొమ్మల దిగుమతులపై సుంకాన్ని 2020లో 20 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి పెంచింది. అంతేకాక.. పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం చూపకుండా ఉండేందుకు దిగుమతి అయ్యే బొమ్మలపై క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌ను తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో బొమ్మలు తయారుచేసే ఎంఎస్‌ఎంఈ యూనిట్లను ప్రోత్సహించడానికి రూ.55.65 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది.   

రూ.3,500 కోట్లతో మరో పథకం 
అదే విధంగా.. ఇతర దేశాలతో పోటీపడేలా బొమ్మల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి రూ.3,500 కోట్లతో ఉత్పత్తి ఆధారిత, ప్రోత్సాహక ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. ఈ చర్యలు రాష్ట్రంలోని బొమ్మల తయారీ కళాకారులకు చేయూతనిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను వన్‌ డిస్ట్రిక్‌ వన్‌ ప్రోడక్ట్‌ కింద చేర్చి ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో 2021–22లో రాష్ట్రం నుంచి రూ.3.66 కోట్ల విలువైన బొమ్మలు ఎగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top