ఎక్సైజ్‌ శాఖలో అప్పుల అప్పారావు! | Excise department officer collects lakhs of rupees from liquor shopkeepers | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ శాఖలో అప్పుల అప్పారావు!

Aug 19 2025 6:13 AM | Updated on Aug 19 2025 6:13 AM

Excise department officer collects lakhs of rupees from liquor shopkeepers

మద్యం దుకాణదారుల వద్ద రూ.లక్షల్లో వసూళ్లు

సెలవులో పంపిన ఉన్నతాధికారులు 

అప్పులు అడగకుండా ఎత్తుగడలు 

చినబాబు అండ ఉందంటూ పరోక్ష బెదిరింపులు 

తిరిగి ఇక్కడికే వస్తానంటూ హెచ్చరికలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పుల అప్పారావు... ఇది సినిమా పేరు కాదు. విశాఖలోని ఎక్సైజ్‌ సీఐకు ఉన్న మరో మారుపేరు. గతంలోనే అనేక ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లి వచ్చిన సీఐ తన అసలు బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. పైగా కీలకమైన శివారు ప్రాంతంలో పోస్టింగును పై నుంచి ఒత్తిడి తెచ్చి మరీ దక్కించుకున్న ఆయన యథావిధిగా వసూళ్లకు దిగారు. తనకు అవసరాలు ఉన్నాయి.. అప్పు ఇవ్వాలంటూ తెలిసిన అన్ని మద్యం షాపుల యాజమానులతో పాటు బార్ల యజమానుల నుంచి భారీగా వసూలు చేసినట్టు తెలుస్తోంది.

రూ.లక్షల్లో ఇలా వసూలు చేసిన నేపథ్యంలో సెలవులో వెళ్లాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. తద్వారా గత నెల రోజులుగా కార్యాలయం వైపునకు సదరు సీఐ రాలేదని సమాచారం. అప్పటివరకు పక్క స్టేషన్‌ ఎక్సైజ్‌ సీఐకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో తిరిగి తానే ఇక్కడకు వస్తానంటూ చెబుతున్నారని.. చినబాబు సిఫార్సుతో మరోసారి ఇక్కడే రాజ్యమేలుతానని కూడా పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా తనకు అప్పులిచ్చిన వారు తిరిగి అడగకుండా ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖలో ప్రచారం జరుగుతోంది.  

పోస్టింగుపైనా రచ్చ రచ్చే..! 
వాస్తవానికి సదరు సీఐ పోస్టింగు వ్యవహారంలోనూ ఎక్సైజ్‌శాఖలో మొదట రచ్చ రచ్చ నడిచింది. మొదటగా మహారాణిపేట సీఐగా పోస్టింగు కోసం ఆయన ప్రయతి్నంచారు. అయితే, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయనే పోస్టింగు ఇచ్చేందుకు వెలగపూడి ఒప్పుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా విశాఖలో ఎక్కడా పోస్టింగు ఇచ్చేందుకు ఆయన అంగీకరించకపోవడంతో పాటు ఇతర ఎమ్మెల్యేలకు కూడా సూచించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే తనకున్న పలుకుబడితో నేరుగా చినబాబు ద్వారా సిఫారసు చేయించుకుని శివారు ప్రాంతంలో పోస్టింగును ఆయన దక్కించుకోవడం గమనార్హం.

కీలకమైన ఆ స్టేషన్‌లో అప్పటికే ఓ సీఐను నియమించగా ఆయన్ని తప్పించి మరీ ఈయన పోస్టింగ్‌ పొందాడు. సీనియర్‌ ఎమ్మెల్యే కూడా పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆయన పోస్టింగ్‌కు తలూపినట్టు ప్రచారం జరిగింది. నిజానికి ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. దొంగచలానాల కేసులో ఆయన కేసులను ఎదుర్కోవడంతో పాటు జైలుకు కూడా వెళ్లొచ్చారు. గతంలో నడిచిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వసూలైన మొత్తంలో వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి అధికారిని మొదటగా ఇక్కడ నియమించేందుకు పోస్టింగు వ్యవహారాలన్నీ చూసిన వెలగపూడి ఒప్పుకోలేదు. అయినప్పటికీ పైన తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి సీనియర్‌ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చి మరీ పోస్టింగును దక్కించుకున్నట్టు తెలుస్తోంది.  

అందరి వద్దా అప్పులే...! 
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసింది. ఈ స్థానంలో ప్రైవేటు దుకాణాలకు తెరలేపింది. దీంతో ఈయన వసూళ్లకు మంచి అవకాశం లభించింది. తన పరిధిలో ఏర్పాటైన ప్రతీ ప్రైవేటు మద్యం దుకాణం యజమాని నుంచి ఆయన అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తే... ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ప్రైవేటు మద్యం దుకాణదారుల నుంచి లక్షల్లో అప్పులు తీసుకున్నారు.

అంతేకాకుండా బార్ల యజమానుల నుంచి కూడా అప్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. మొత్తంగా రూ.లక్షల్లో తీసుకున్న అప్పులను ఆయన ఎవరికీ తిరిగి చెల్లించలేదని సమాచారం. వీరందరూ కాస్తా ఉన్నతాధికారులకు సిఫారసు చేయడంతో సెలవులో వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. అయితే, తాను సెలవులో మాత్రమే వెళుతున్నానని, తిరిగి ఇక్కడకే వస్తానంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగుతూ.. అప్పులిచ్చిన వారు తిరిగి అడగకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా నేరుగా చినబాబు పేరు కూడా చెబుతుండటంతో ఎవరూ నోరెత్తడం లేదని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement