
మంత్రి అనుచరులు వేధిస్తున్నారు
ఇప్పటికే నా కుమారుణ్ని పోగొట్టుకున్నా
సోషల్ మీడియా వేదికగా వృద్ధ రైతు ఆవేదన
పెనుకొండ రూరల్: పొలం కంచె విషయమై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరులు అధికారులను అడ్డు పెట్టుకుని తమను వేధిస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన వృద్ధ రైతు రఘురామి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆవేదనతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారింది. వివరాలు ఆయన మాటల్లోనే... ‘మాకు సర్వే నంబర్ 300లో పట్టా భూమి 1.87 ఎకరాలు ఉంది. దీనికి కంచె వేసే విషయమై కొద్ది రోజులుగా అధికారులను అడ్డు పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఇప్పటికే మా స్థలంలో సీసీ రోడ్డు నిర్మించారు. గ్రామ అభివృద్ధికే కదా అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు రోడ్డుపై గ్రామానికి చెందిన వారి పశువులను తోలుతున్నారు. అవి పంటలను మేసేస్తున్నాయి. వాటి నుంచి పంటలకు రక్షణగా పొలానికి కంచె వేసుకున్నాం. దాన్ని తొలగించాలని మంత్రి అనుచరులు గోపాల్, మొద్దన్న, నరసింహప్ప పంచాయతీ సెక్రటరీని, రెవెన్యూ సిబ్బందిని పంపి వేధిస్తున్నారు. లేదంటే కుటుంబం మొత్తం మీద క్రిమినల్ కేసులు పెడతామని భయపెడుతున్నారు. తహసీల్దార్ సైతం ఫోన్ చేసి కంచె తొలగించాలంటున్నారు.
కొలతలు వేయించాలని చెప్పినా అధికారులు వినడం లేదు. ఇప్పటికే మంత్రి అనుచరుల వేధింపులు తాళలేక నా కుమారుడు సుధాకర్ రెడ్డి ఉరేసుకుని చనిపోయాడు. రూ.ఐదు లక్షల రూపాయలు ఇస్తే సరి.. లేదంటే బోరుబావిని పీకేసి భూమిని సైతం లాక్కుంటామని బెదిరించడంతో నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణ ధ్రువీకరణ పత్రం విషయంలోనూ మమ్మల్ని వేధించారు. నేను, నా భార్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాం. మా ఇద్దరు మనవరాళ్ల కోసమే మేము జీవిస్తున్నాం.
మేము ఏ రాజకీయ పార్టీకీ చెందినవాళ్లం కాదు. అయినా మా కుటుంబం మీద మంత్రి అనుచరులకు పగ ఎందుకో?! సవితమ్మా.. మా కుటుంబానికి కాస్త విషమివ్వు తల్లీ! మా కడుపులు కొట్టకు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై తహసీల్దార్ స్వాతిని ‘సాక్షి’ వివరణ కోరగా... సర్వే నంబర్ 298–2లో 3.46 ఎకరాల రస్తా పొరంబోకు భూమి ఉందని, ఇందులో దాదాపు 54 సెంట్ల స్థలాన్ని రైతు ఆక్రమించారని చెప్పారు. ఈ క్రమంలో కంచె తొలగించాలని చెప్పామని పేర్కొన్నారు.