8,421 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి  

Drone survey completed in 8421 villages Andhra Pradesh - Sakshi

మరింత వేగంగా డ్రోన్, ఏరియల్‌ సర్వే చేసేందుకు చర్యలు

ఫిబ్రవరిలో మరో 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు  

సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేలో డ్రోన్లతో భూమిని కొలిచే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 8,421 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యింది. 15 రోజుల్లోనే 700 గ్రామాల్లో సర్వేను పూర్తి చేయడం విశేషం. సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన డ్రోన్లు 4,769 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా.. ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లు 3,652 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 807 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యింది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్, ఏరియల్‌ సర్వే చేసేందుకు.. సర్వే బృందాలు విస్తృతంగా పని చేస్తున్నాయి.

మరోవైపు డ్రోన్‌ సర్వే పూర్తయిన 4,006 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజెస్‌(చాయాచిత్రాలు)ను ఇప్పటికే విడుదల చేశారు. వీటితోనే సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. డ్రోన్‌ చిత్రాల ఆధారంగా ఇప్పటికే 3,031 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజ నిర్థారణ(గ్రౌండ్‌ ట్రూతింగ్‌)ను పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని 3.58 లక్షల ఎకరాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయ్యింది. 975 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.

చివరిగా నిర్వహించే గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ను కూడా 2,409 గ్రామాల్లో పూర్తి చేశారు. 622 గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ పూర్తయిన గ్రామాల్లో 19,355 అభ్యంతరాలు రాగా.. వాటిలో 19,299 అభ్యంతరాలను మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు పరిష్కరించాయి. మొత్తంగా ఇప్పటివరకు అన్ని దశల్లో రీ సర్తే పూర్తయిన గ్రామాలు 2,913 ఉన్నాయి.

ఈ గ్రామాలకు సంబంధించి సర్వే పూర్తయినట్లు నంబర్‌ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 1,800 గ్రామాల్లో కూడా నంబర్‌ 13 నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్‌ యంత్రాంగం కృషి చేస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top