శరవేగంగా ‘మోడ్రన్‌ మార్చురీ’

Development Work On The KGH Modern Mortuary Begun - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): కేజీహెచ్‌ మోడ్రన్‌ మార్చురీ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న మార్చురీని ఆధునికీకరిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం వచ్చే వారి మృతుల బంధువుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్‌ నిర్మాణం చేపట్టారు. అనంతరం ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. మోడ్రన్‌ మార్చురీ అభివృద్ధికి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున రూ.50 లక్షలు మంజూరు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు అనుసంధానంగా ఉన్న మోడ్రన్‌ మార్చురీ ఆధునికీకరణపై ఏఎంసీ ప్రిన్సిపాల్‌ సాంబశివరావు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.మైథిలి, ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులతో గత నెల 28న కలెక్టర్‌ చర్చించిన విషయం తెలిసిందే. 

కేజీహెచ్‌కు, ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా మార్చురీ ఉంది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, బీచ్‌లో గల్లంతు, రైలు ప్రమాదాల్లో మృతులకు పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తీసుకు వస్తుంటారు. మృతదేహాలతో పాటు వారి బంధువులు ఇక్కడికి వస్తుంటారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు..మరో వైపు శవ పంచనామా చేసేందుకు పోలీసులు..తరచూ కేజీహెచ్‌ మార్చురీకి వస్తుంటారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు వీరంతా మండుటెండల్లోనో, జోరువానలోనో నిరీక్షించాల్సిన దుస్థితి గతంలో ఉండేది. 

మార్చురీ అభివృద్ధిపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి 
కేజీహెచ్‌ మార్చురీ ఆధునికీకరణకు కలెక్టర్‌ మల్లికార్జున ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మార్చురీ అభివృద్ధికి సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపారు. తక్షణమే పనులు చేపట్టాలని గత నెలలోనే ఆదేశించారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి పోస్ట్‌ మార్టం కోసం వచ్చే బంధువులు, పోలీసులు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా, మండుటెండల్లో నిరీక్షించకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక షెడ్డు వేసి, అందులో ఏసీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడమే గాక ఈ పనుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. కొద్ది రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  

(చదవండి: బొర్రా గుహలకు మెట్రో గేటు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top