క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు 

Cyclone Mandous:The Fishermen From Chirala Returned Safely - Sakshi

ఈ నెల 4న వేటకెళ్లిన గంగపుత్రులు

మాండూస్‌ తుపాను కారణంగా చుట్టుముట్టిన రాకాసి అలలు

సిగ్నల్స్‌ కట్‌ అవడంతో పనిచేయని మొబైల్స్‌ 

కొత్తపట్నం తీరంలో 48 గంటల నిరీక్షణ

ఫలించిన ఎన్డీఆర్‌ఎఫ్, మెరైన్, సివిల్‌ పోలీస్‌ రెస్క్యూ ఆపరేషన్‌

కొత్తపట్నం/చీరాల టౌన్‌:  బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోగా.. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి ఆదివారం సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న ఏడుగురు మత్స్యకారుల బృందం ఓడరేవు గ్రామం నుంచి గరికన కృష్ణ, మల్లె బంగారయ్య, మెరుగు శివ, కుక్కల మహేష్, మరద పౌలు, దాసరి పంపోజీ, మెరుగు ప్రసాద్‌ (డ్రైవర్‌) సముద్రంలో నెల్లూరు జిల్లా వైపు బయలుదేరారు.

4 రోజుల పాటు వేట కొనసాగించారు. ఆ సమయంలో మాండూస్‌ తుపాను హెచ్చరికలు వెలువడటంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వీరి మొబైల్‌ సిగ్నల్స్‌ నిలిచిపోగా.. కాసేపటికే ఆ బోటులోని ఒక ఇంజన్‌ చెడిపోయింది. అలల ఉధృతికి బోటు ముందుకు సాగలేదు. దీంతో వారు నడిసంద్రంలోనే బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా ముందుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం మొబైల్‌ సిగ్నల్స్‌ పనిచేయడంతో టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి తాము ఆపదలో ఉన్నామని అధికారులకు సమాచారమిచ్చారు.  

యంత్రాంగం అప్రమత్తం
సమాచారం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మెరైన్, మత్స్యశాఖ, స్పెషల్‌ బ్రాంచ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, కోస్ట్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులతో ఫోన్‌లో సంప్రదించగా.. రాకాసి అలలు ఉధృతంగా వస్తున్నాయని బోటు తిరగబడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్తపట్నం సమీపంలోని గుండమాల రేవుకు వెళ్తామని అధికారులకు చెప్పగా.. చీరాల మత్స్యశాఖ జేడీ పి.సురేష్, ఇతర అధికారులు కొత్తపట్నం బీచ్‌కు చేరుకున్నారు. అనంతరం మత్స్యకారులతో ఫోన్‌లో మాట్లాడి.. వారిని గుండమాలకు వెళ్లొద్దని, కొత్తపట్నం బీచ్‌కు రావాలని, తాము ఇక్కడే ఉన్నామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వారంతా శనివారం రాత్రి 9 గంటలకు కొత్తపట్నం సమీపానికి వచ్చారు. అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో ముందుకు రాలేమని చెప్పి బీచ్‌కు 500 మీటర్ల దూరంలో లంగర్‌ వేసుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం  కొత్తపట్నం బీచ్‌కు చేరుకుని వేరే బోటును తీసుకెళ్లి వారిని తీసుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top