AP: ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి: సీఎస్‌ | Sakshi
Sakshi News home page

AP: ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా చేయాలి: సీఎస్‌

Published Sat, Mar 16 2024 7:27 PM

Cs Jawahar Reddy Video Conference With Collectors On Ap Elections - Sakshi

సాక్షి, విజయవాడ: లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన యాడ్‌లు, వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్‌ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్‌లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు.

అంతేగాక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని సీఎస్ స్పష్టం చేశారు. మంత్రుల ఎన్ని కల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండ రాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు. అదే విధంగా మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీలు లేదని సీఎస్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఏ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు‌. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు.

అలాగే పీఎం,సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకై  సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement