విజయవాడకు తూర్పు మణిహారం

Construction of bypass road to Vijayawada National Highway - Sakshi

ఎన్‌హెచ్‌–16పై 40 కి.మీ. తూర్పు బైపాస్‌ నిర్మాణానికి మార్గం సుగమం 

భూసేకరణ వ్యయానికి ప్రత్యామ్నాయంగా ఎన్‌హెచ్‌ఏఐకి 100 ఎకరాలు  

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం 

సాక్షి, అమరావతి: విజయవాడకు తూర్పు మణిహారంగా జాతీయ రహదారికి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. చెన్నై–కోల్‌కతా  జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. భూసేకరణ వ్యయానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సూత్రప్రాయంగా ఆమోదించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాదాపు రూ.2 వేల కోట్లతో 40 కిలోమీటర్ల మేర విజయవాడ తూర్పు బైపాస్‌ మార్గం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ తుదిదశకు చేరుకుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది. 

హైవేపై ట్రాఫిక్‌ కష్టాలకు తక్షణ పరిష్కారం  
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) విజయవాడ నగరంలో నుంచి వెళుతుండటంతో దశాబ్దాలుగా ట్రాఫిక్‌ సమస్యలు జఠిలమవుతూ వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ట్రాఫిక్‌ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి యోచించకుండా గ్రాఫిక్కులతో కనికట్టు చేసిన అమరావతిలో ఓఆర్‌ఆర్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. 30 ఏళ్ల తరువాత ఆ ప్రాంతంలో పెరిగే ట్రాఫిక్‌ కోసమని ఇప్పుడు పశ్చిమ బైపాస్‌ నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు తక్షణ పరిష్కారం గురించి యోచించింది.

బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే పోర్టు నుంచి రాకపోకలు సాగించే భారీ వాహనాలతో విజయవాడ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్యలు మరింత తీవ్రమవుతాయని గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా విజయవాడకు తూర్పు వైపున బైపాస్‌ రహదారి నిర్మించాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడంతో తూర్పు బైపాస్‌ నిర్మాణం దిశగా ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణ చేపట్టింది.  

కాజ నుంచి చిన అవుటపల్లి వరకు.. 
జాతీయ రహదారిపై గుంటూరు జిల్లాలోని కాజ నుంచి కృష్ణాజిల్లాలోని కంకిపాడు మీదుగా చిన అవుటపల్లి వరకు నాలుగు లేన్ల బైపాస్‌ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 40 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ బైపాస్‌ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3,600 మీటర్ల పొడవున వంతెన నిర్మిస్తారు. దాదాపు రూ.2 వేలకోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈ బైపాస్‌ నిర్మాణంతో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా ప్రయాణిస్తాయి. బందరు పోర్టుకు వెళ్లే, వచ్చే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి రాకుండానే జాతీయ రహదారిపై బైపాస్‌ మీదుగా అటు చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ల వైపు వెళ్లవచ్చు.  

మల్టీమోడల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి 100 ఎకరాలు  
బైపాస్‌ రహదారి నిర్మాణానికి అయ్యే రూ.2 వేలకోట్లలో దాదాపు రూ.525 కోట్లు భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రహదారి, వంతెన నిర్మాణాలకు ఎన్‌హెచ్‌ఏఐ నిధులు సమకూరుస్తుంది. భూసేకరణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు సమర్పించింది. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మినహాయించుకుంటామని ప్రతిపాదించింది. అందుకు సమ్మతించిన కేంద్రం భూసేకరణ వ్యయంలో 50 శాతం భరించాలని చెప్పింది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది.

అదే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్రంలో జాతీయ రహదారుల పక్కన మల్టీమోడల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం 100 ఎకరాలను కేటాయిస్తామని ప్రతిపాదించింది. దీనికి బదులుగా విజయవాడ తూర్పు బైపాస్‌ కోసం భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరిం చాలని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టుబట్టడంతో కేంద్రం ఆమోదించింది. భూసేకరణ వ్యయంతోసహా విజయవాడ తూర్పు బైసాస్‌ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భ రించేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top