
ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరితెగింపు
రూ.11 కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్‌లో హైడ్రామా
మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం
ఇన్నాళ్లైనా ఒక్క ఆధారమూ చూపలేకపోయారని తప్పుబట్టిన కోర్టు
నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు కొత్త నాటకానికి తెర
వర్ధమాన్ కాలేజీకి చెందిన నగదును రాజ్ కేసిరెడ్డిదిగా నమ్మించే కుట్ర
గతంలో సోదాల్లో దొరకని డబ్బు.. అకస్మాత్తుగా పుట్టుకొ చ్చిన వైనం
అదికూడా 2024 జూన్ నుంచి వారి నివాసంలోనే ఉన్నట్లు కట్టుకథలు
విజయేందర్‌రెడ్డి అనుకూలంగా మారాకనే వారింట్లో నగదు లభ్యం!
వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏమిటి?
నివాసంలోని సొమ్మును వేరేవాళ్లదిగా ఆయనతోనే చెప్పిస్తూ కుతంత్రం
ఇదంతా గమనిస్తే... స్పష్టంగా అర్థం అవుతున్న సిట్ పన్నాగం
ఒకే తరహా ఎ–4 కాగితాల పెట్టెల్లో అర్ధరాత్రి చకచకా పుట్టుకొ చ్చిన నగదు
జప్తు గురించి మీడియాకు లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేశ్ సమాచారం.. ఇదంతా టీడీపీ ప్రధాన కార్యాలయం స్కెచ్చేనని బట్టబయలు
ఇంతకంటే బరితెగింపు ఏముంటుంది? అక్రమ కేసు అనేందుకు ఇది నిదర్శనం కాదా?
రూ.11 కోట్లు జప్తు చేసినట్లు చెబుతున్న సిట్ కట్టుకథ బూమరాంగ్
పాతాళభైరవి సినిమాలో నేపాలీ మాంత్రికుడిని తలదన్నే రీతిలో సీఎం చంద్రబాబు రోజుకో క్షుద్ర రాజకీయానికి తెరతీస్తున్నారు. తాను ఏంచెప్పినా ఎస్ బాస్ అనే పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను మంత్రదండంగా చేసుకుని రాజకీయ కుతంత్రానికి పాల్పడుతున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా ఏకంగా న్యాయస్థానాన్ని కూడా బురిడీ కొట్టించేందుకు తెగిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్టుతో డ్రామాను రక్తి కట్టించేందుకు ప్రయత్నించి సిట్ బోల్తా పడింది.
న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు గత శనివారం హైదరాబాద్‌లోని వికాట్ కంపెనీ కార్యాలయంలో సోదాల పేరిట సిట్ హడావుడి చేసింది. అది ఫలించకపోవడంతో తాజాగా నగదు జప్తు కుతంత్రానికి తెరలేపింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు రెడ్‌బుక్ కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం రోజుకో రీతిలో నడుపుతున్న హైడ్రామాలో తాజా ఎపిసోడ్ ఇదిగో ఇలా ఉంది..
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసు దర్యాప్తులో ఏస్థాయికైనా దిగజారతామనేలా సిట్ మరో బరితెగింపునకు పాల్పడింది. నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. ఇన్నాళ్లైనా ఒక్క ఆధారమూ చూపలేకపోయారని సాక్షాత్తు కోర్టు తప్పుబట్టడంతో నోట్ల ‘కట్ట’కథకు సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి శంషాబాద్ మండలం కాచారంలో వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. ఆ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగానే సిట్ హైడ్రామాకు తెరతీసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపేందుకు సిట్ ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులు, సాక్షులను బెదిరించి, వేధించిన విషయం తెలిసిందే. కాగా, లేని ఆధారాలు సృష్టించాలని, ఏదో ఒక విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. దాంతో రాజ్ కెసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించేందుకు ప్రయత్నించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం స్క్రిప్ట్‌ను అమలులోకి తెచ్చింది. అదేమిటంటే...
» వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా కాచారంలోని విజయేందర్‌రెడ్డికి చెందిన సులోచన ఫామ్‌హౌస్‌కు తరలించారు. అది కూడా ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ నగదు తీసుకెళ్తే ఎవరైనా మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి ఈ విధంగా ముందు జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చాక కుట్రలో రెండో అంకం మొదలుపెట్టారు.
బుధవారం తెల్లవారుజామున సిట్ అధికారులు విజయేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు..రూ.11 కోట్లను జప్తు చేసినట్లు డ్రామా రక్తి కట్టించారు. ఈ నగదంతా రాజ్ కెసిరెడ్డిదేనని..2024 జూన్ నుంచే ఇక్కడ ఉంచారంటూ కట్టుకథను మీడియాకు లీకు చేశారు. కానీ, టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ పన్నాగం బూమరాంగ్ అయ్యింది. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే సిట్ కుట్ర బెడిసికొట్టింది.
చిత్తు కాగితాల అట్టపెట్టెల్లో అంత డబ్బు దాచారా?
కట్టుకథతో నమ్మించేందుకు సిట్ చేసిన పన్నాగం నవ్వులపాలైంది. గతంలో ఎప్పుడూ సోదాల్లో దొరకని డబ్బు, అకస్మాత్తుగా పుట్టుకు రావడమే దీనికి కారణం. పైగా ఏకంగా 14 నెలలుగా అక్కడే ఉన్నట్లు తెలపడాన్ని బట్టి చూస్తే... ఇదంతా సిట్ పన్నాగం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు విజయేందర్‌రెడ్డి అనుకూలంగా మారాకనే ఇదంతా జరగడం గమనార్హం.
వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏమిటి? నివాసంలోని సొమ్మును వేరేవాళ్లదిగా ఆయనతోనే చెప్పించడం ఏమిటి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక అర్థరాత్రి చకచకా పుట్టుకొచ్చి పట్టుబడినది అని చెబుతున్న నగదు అంతా ఒకే తరహా అట్టపెట్టెల్లో (ఆఫీసుల్లో ఏ4 తెల్ల కాగితాల బండిల్స్ పెట్టేవి) ఉండడం ఆశ్చర్యపరిచింది. స్టేషనరీ సామగ్రి పెట్టే సాధారణ 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్లను ఉంచారని చెప్పడం సిట్ విస్మయకర తంతు ఏవిధంగా ఉందో తెలుస్తోంది.
బెయిల్‌ను అడ్డుకోవడానికే సిట్ కుట్రలు
సిట్ అధికారులు ఇంత చీప్ ట్రిక్‌కు ఎందుకు పాల్పడ్డారన్నదే కదా సందేహం... అక్కడే ఉంది అసలు కథ. ఈ కేసులో తాము అక్రమంగా అరెస్టు చేసినవారికి బెయిల్ రాకుండా కోర్టును తప్పుదారి పట్టించడమే సిట్ లక్ష్యం. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయింది. కేసులో ఏ1గా పేర్కొన్న రాజ్ కెసిరెడ్డిని సిట్ ఏప్రిల్ 21న అరెస్టు చేసింది. వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కానీ, సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దీంతో 90 రోజుల తరువాత బెయిల్ ఇచ్చేందుకు సాంకేతికంగా మార్గం సుగమైనట్టే. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు అదే విషయాన్ని ప్రస్తావించింది. వివిధ సంస్థల పేరిట బ్యాంకులో ఉన్న నగదును జప్తు చేయడం మినహా సిట్ అధికారులు దర్యాప్తులో ఏం గుర్తించారు? ఏం సాధించారు? అని ప్రశ్నించింది.
దాంతో సిట్ అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అందుకే లేని ఆధారాన్ని ఉన్నట్టు చూపాలని భావించి హడావుడిగా విజయేందర్‌రెడ్డిని తమ కుట్రలో పావుగా చేసుకున్నారని స్పష్టమవుతోంది. రూ.11 కోట్లు జప్తు చేసినట్టు, ఆ నగదు రాజ్ కెసిరెడ్డిది అని కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం.
» అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరుల బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ ఇదే రీతిలో శనివారం హైడ్రామా సాగించింది. హైదరాబాద్‌లోని వికాట్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయంలో సోదాల పేరుతో హడావుడి చేసింది. కోర్టు నుంచి అనుమతి లేకుండా సిట్ అ«దికారుల బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద రాద్ధాంతం సృష్టించి...భయపెట్టేందుకు ప్రయత్నించింది.
లోకేశ్ సన్నిహితుడు కిలారి సిట్ అధికార ప్రతినిధా!?
రూ.11 కోట్ల జప్తు స్క్రిప్ట్ కథ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నడిపించారన్నది తేటతెల్లమైంది. ఆ నగదును జప్తు చేసినట్టు టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు మంత్రి లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేష్ తెలపడమే దీనికి నిదర్శనం. ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేదు. సిట్‌తో అధికారికంగా సంబంధం లేదు. కానీ, సిట్ అధికార ప్రతినిధి అన్నట్టుగా బుధవారం తెల్లవారుజామునే రూ.11కోట్ల జప్తు చేసిన ఫొటోలు, సమాచారం ఇవ్వడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే, ఈ జప్తు కథ అంతా టీడీపీ కేంద్ర కార్యాలయం డైరెక్షన్‌లోనే సాగిందన్నది స్పష్టమైంది.
కట్టుకథలో తాజా పాత్రధారి వరుణ్
మద్యం అక్రమ కేసులో నిందితుడు వరుణ్ పురుషోత్తంను నోట్ల కట్టల కట్టు కథలో సిట్ పాత్రధారిగా చేసుకుంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే తాము ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేసి నగదును గుర్తించినట్టు చెప్పుకొచ్చింది. అక్రమ కేసులో ఏ 40గా పేర్కొన్న వరుణ్ విదేశాలకు పరారయ్యారని సిట్ ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చింది. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేసింది.
విదేశాల్లో ఉన్న వరుణ్ పురుషోత్తం హఠాత్తుగా హైదరాబాద్‌లో ఎలా ప్రత్యక్షమయ్యారో మరి...? అంటే సిట్ ఆయన్ను అక్రమంగా నిర్బంధించి వేధించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించిందని స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కొసమెరుపు: విజయేందర్‌రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ సరిగ్గా సులోచన ఫామ్‌హౌస్‌కు ఎదురుగానే ఉంటుంది. దీంట్లోనే రాత్రికిరాత్రే రూ.కోట్ల నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. కానీ, అవి ఆయనవి కావు అని.. రాజ్ కెసిరెడ్డివని చెబుతుండడం.
ఆ నగదు నాది కాదు..
రూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుట్రను రాజ్ కెసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకుగానీ తన కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానానికి నివేదించారు. ఆ నగదుకు వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాజ్ కెసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం సాయంత్రం అఫిడవిట్ దాఖలు చేశారు.
విజయేందర్‌రెడ్డి కుటుంబానికి హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇంజినీరింగ్ కాలేజీ, ఇతర వ్యాపారాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఏటా వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాపార సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు. తాను ఫాంహౌస్‌లో నగదు దాచలేదని నివేదించారు.