‘డౌనూరు’లో కాఫీ క్యూరింగ్‌ కేంద్రం

Coffee curing center at Daunur - Sakshi

దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు

అల్లూరి జిల్లాలో శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం రాజన్నదొర

కొయ్యూరు: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. కొయ్యూరు మండలంలోని డౌనూరులో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తోన్న కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, ప్యాకింగ్‌ యూనిట్‌కు శుక్రవారం వైఎఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి రాజన్నదొర శంకుస్థాపనచేసి శిలాఫలకాన్ని ఆవి­ష్కరించారు.

ఆయన మాట్లాడుతూ..నాణ్యమైన సేంద్రియ ఎరువులతో కాఫీని పండించడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో అతిథులకు ప్రధాని మోదీ అరకు కాఫీని బహూకరించారని గుర్తు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్‌లో ప్రస్తుతమున్న 2.5 లక్షల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

తమ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు. గిరిజనుల నుంచి పసుపును కూడా కొనుగోలు చేయాలని జీసీసీ ఎండీ సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. గిట్టుబాటు ధర విషయంలో రాజీ పడబోమ­ని స్పష్టం చేశారు. కాఫీ రైతులకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ఐటీడీఏ పీవో అభిషేక్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top