తిరుమల: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

CM YS Jagan Two Days Tirupati Tour Day 2 Live Updates - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

రంగనాయకుల మండపంలో సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత నూతన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు. రూ.22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరకామణి భవనం నిర్మించారు. భక్తుల మధ్య శ్రీవారి కానుకలు లెక్కించేలా టీటీడీ చర్యలు చేపట్టింది.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు.
చదవండి: శ్రీవారి సేవలో సీఎం

పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top