YS Jagan: ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ | Review Meeting With Child Welfare Department Officials - Sakshi
Sakshi News home page

బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్‌

Mar 6 2021 3:19 AM | Updated on Mar 6 2021 8:59 AM

CM Jagan Review Meeting With Women and Child Welfare Department officials - Sakshi

ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌

ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ల్యాప్‌టాప్‌ల సహకారంతో వారికి కోచింగ్‌ ఇవ్వాలి. ఇందు కోసం ఇంటరాక్టివ్‌ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలి. తద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8 (మహిళా దినోత్సవం)న ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్‌ ఆఖరుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా.. ఎంఓయూలు కుదుర్చుకుంటాయని సీఎంకు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు జూలై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేస్తామని తెలిపారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ ఇస్తామని, ఇందు కోసం సుమారు రూ.41.4 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఆసరా, చేయూత కిరాణా స్టోర్స్‌లో తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన, బయోడీగ్రేడబుల్‌ (త్వరగా భూమిలో కలిసిపోయే) శానిటరీ నేప్‌కిన్స్‌ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందు కోసం శానిటరీ నాప్‌కిన్స్‌ తయారు చేసే అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్‌ ఎంఓయూ చేసుకుంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  
 
శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థల సహకారం 
విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇందు కోసం లాప్‌టాప్‌లను వాడుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్‌ ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థలు, కోచింగ్‌ సెంటర్ల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు లాప్‌టాప్‌లను ఇచ్చే సమయానికి, దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement