చెప్పింది చెప్పినట్లుగా.. నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ పంపిణీ | Sakshi
Sakshi News home page

చెప్పింది చెప్పినట్లుగా.. నేడు ‘వైఎస్సార్‌ ఆసరా’ పంపిణీ

Published Tue, Jan 23 2024 5:12 AM

CM Jagan To Release Fourth installment of YSR Asara Scheme Funds - Sakshi

సాక్షి, అమరావతి: చెప్పాడంటే చేస్తాడంతే.. అన్న నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల విషయంలో అక్షరాలా నిజం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వారికి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. మాట ఇస్తే తప్పడని ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఆయన తన విశ్వసనీయతను మళ్లీమళ్లీ చాటుకుంటు­న్నారు.

ఇందులో భాగంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు సంపూర్ణంగా అమలుచేయబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో ఆయన డ్వాక్రా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమచేయగా.. తాజాగా, మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను జమచేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్‌ పూర్తిస్థాయిలో నెరవేర్చనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) గణాంకాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్‌ జరిగిన 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది డ్వాక్రా మహిళల పేరిట రూ.25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ఆయా మహిళల ఖాతాల్లో జమచేశారు. ఇక మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను కూడా నేరుగా వారి ఖాతాల్లో జమచేయబోతోంది.ఈ నేపథ్యంలో.. నాలుగో విడత ‘వైఎ­స్సార్‌ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నిజానికి.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దు.. పొదుపు సంఘాల తరఫున తామే చెల్లిస్తామని 2014లో పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీ ఇచ్చారు. కానీ, దాన్ని అమలుచేయని కారణంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఆ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాటికి తిరిగి ఊపిరిపోశారు.


ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు..
ఇక వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే..
► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సి­పల్‌ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు. 
► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. 
► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు. 
► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. 

నేడు సీఎం జగన్‌ ఉరవకొండ పర్యటన 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించి, డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు, ఆ తర్వాత వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.

56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి..
వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వా­­రా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. 
► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్‌ లివర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్‌గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్‌ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది.
► అంతేకాక.. కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్‌ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకా­ణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. 
► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. 
► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్‌ల ద్వారా లబ్ధిపొందుతున్నారు. 
► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి. 
► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. 
► అనంతరం.. జగన్‌ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ ఆసరా‘, ‘వైఎస్సార్‌ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధి­పొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్‌పీ­ఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి. 

 
Advertisement
 
Advertisement