
సాక్షి, అమరావతి: తీరిక దొరికితే చాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు వారాంతాల్లో, సెలవు రోజుల్లో విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 70 సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చినట్లు టీడీపీ కూటమి వర్గాలు.. అధికార వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.
ఆ తర్వాత ఆదివారం 71వ సారి కూడా హైదరాబాద్ వెళ్లి రావడంతో మరోమారు ఈ విషయం వైరల్ అయ్యింది. మంత్రి లోకేశ్ ఈ 16 నెలల్లో 77 సార్లు హైదరాబాద్‌కు వెళ్లొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర, ఎన్నికల ప్రచార సమయంలో మినహా ఏపీ వైపే చూడలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం.
సినిమా షూటింగ్‌లు, వ్యక్తిగత పనులకే అక్కడ పరిమితం కావడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు, పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడుపుతున్నారని, విజయవాడలో ఉన్న రోజులను వేళ్లపై లెక్క పెట్టవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.