
జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: అభివృద్ధికి అడ్డంకిగా మారిన నాలా చట్టాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాలా అనేది చాలా మందికి మనీ కలెక్షన్ సెంటర్‌గా మారిందని, దీనివల్ల అనుమతులు ఆలస్యం అవుతుండటంతో ఆభివృద్ధి నెమ్మదిస్తోందని, అందుకనే ఆదాయం నష్టపోతున్నా కూడా దీన్ని రద్దు చేస్తున్నానని స్పష్టం చేశారు. మంగళ, బుధవారం సచివాలయంలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు.
‘రియల్ ఎస్టేట్ రంగం, పరిశ్రమలకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి రద్దు చేస్తాం. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు కడితే సరిపోతుంది. ఎటువంటి పెనాల్టీ, వడ్డీలు చెల్లించక్కర్లేదు. సంపద అనేది కొందరికే పరిమితం కాకూడదు. అందుకే ఉగాది నుంచి పీ4 పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కలెక్టర్లు అడిగినప్పుడు సమస్యలను చెప్పడం కాదు.
ఆ సమస్యలను వారే పరిష్కరించాలి. గతంలో నేను మాత్రమే పరుగులు పెట్టే వాడిని. ఇప్పుడు నాతో పాటు మిమ్మల్నీ పరుగులు పెట్టిస్తా. 2047 వృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రతి కలెక్టర్ కృషి చేయాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ, ఆర్‌అండ్‌బీ అతిథి గృహాలు ప్రైవేట్ వారికి ఇచ్చి, హోటల్స్‌గా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలి‘ అని చెప్పారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో ప్రైవేట్ రంగంలో పెట్టడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వెనుకబడిన జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు
» శ్రీకాకుళంతో పాటు వెనుకబడిన జిల్లాలో వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలి.
» అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉద్యాన పంటలు నిలువ చేసుకునేందుకు కోల్డ్ చైన్ లింకేజీ సౌకర్యాలను పెంచాలి.
» రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా పనిచేసేలా ప్రతి గృహానికి బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలి.
» గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలి. ఇందు కోసం ఐఏఎస్ అధికారులు వీరపాండియన్‌ను ప్రత్యేకాధికారిగా, విజయరామరాజును అదనపు అధికారిగా నియమిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
హామీలపై కార్యాచరణ ఏదీ?
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంపై కార్యాచరణ లేకుండానే ముగిసింది. ఈ సదస్సుతో పాటు తొలి, రెండవ సదస్సులోనూ సూపర్ సిక్స్ సహా ఇతర హామీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత సదస్సులో మే నెల నుంచి తల్లికి వందనం అమలు చేస్తామంటూ ముక్తాయింపు ఇచ్చారు తప్ప, కలెక్టర్లతో కూలంకషంగా చర్చించలేదు.
ఆదాయం పెంచితేనే హామీలు అమలు చేయగలనని, భారం అంతా కలెక్టర్లపై మోపారు. ఏం చేస్తే వృద్ధి రేటు 15 శాతానికి పైగా సాధించవచ్చో చెప్పకుండా.. ఆ మేరకు లక్ష్యం విధించడం సీఎం చిత్తశుద్ధి లోపమేనని అధికార వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆదాయం ఎలా పెరుగుతుందో కలెక్టర్లు చెప్పక పోవడంతో రంగు రంగుల పీపీటీలతో తనను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులెవ్వరినీ మాట్లాడనివ్వలేదు. మొత్తంగా ఈ తొమ్మిది నెలలో ఏ పనులూ పూర్తి కాలేదని బహిర్గతమైంది.