13 నుంచి శారదా పీఠాధిపతి చాతుర్మాస దీక్ష 

Chaturmasa Deeksha of Sarada Peethadhipati from 13th July - Sakshi

పెందుర్తి: ఈనెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్షను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేపట్టనున్నారు. రుషికేష్‌లోని పవిత్ర గంగానదీ తీరాన శ్రీశారదాపీఠం శాఖలో గురుపూర్ణిమ సందర్భంగా స్వామీజీలు ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది.

స్వామీజీకి ఇది 26వ చాతుర్మాస దీక్ష కాగా.. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నాలుగోసారి దీక్ష చేపట్టనున్నారు. దీక్షా కాలంలో పరివ్రాజ్యలు(పర్యటనలు) చేయరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను స్వీకరించరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు భండారా (అన్నదానం) నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు.

గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తరువాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేపడతారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్‌కు వెళ్తుంటారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top