
మంత్రిగారి కంపెనీకి రూ.600 కోట్ల విలువైన 845.60 ఎకరాలు ధారాదత్తం
పార్థసారథి భార్య కమలాలక్ష్మి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎకరాల విక్రయం
ఏటా రూ.15 వేల లీజు కింద 800 ఎకరాలు
25 ఏళ్లు కేటాయింపు.. ఆగిరిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ.60–70 లక్షలు
నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం
లులుకు నామమాత్రపు ధరకు విశాఖ, విజయవాడలో సంతర్పణ
అంతకుముందు ఊరూ పేరూ లేని ఉర్సాకు రూ.3 వేల కోట్ల విలువైన 60 ఎకరాలు..
అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రజాసంఘాల ఆగ్రహం
బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?
హైదరాబాద్‌లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజుకు.. ఏపీలో మాత్రం రూ.వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత
హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లులు
ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లిగవ్వ కూడా దక్కదు!
హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే
అయినవారికి అడ్డంగా కట్టబెట్టడం... కావాల్సినవారికి నిలువునా దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరి స్తోంది...! అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాలు మాదిరి కారుచౌకగా పంచేస్తోంది..! ఉర్సా నుంచి లులు వరకు... సత్వ మొదలు కపిల్ చిట్ ఫండ్ దాక.. పట్టపగ్గాల్లేకుండా భూ పందేరానికి పాల్పడుతోంది..! కూటమి పార్టీల నేతలకు కట్టబెట్టేస్తోంది...! ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం చేయగా. నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది..! ఆ కథాకమామీషు ఇదిగో...!
సాక్షి, అమరావతి: ‘‘అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించను’’ అంటూ... దైవసాక్షిగా మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, దాన్ని పక్కకుపెట్టి సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన నియోజకవర్గంలోని విలువైన భూములను సొంత సంస్థకు దక్కించుకున్నారు. పరిశ్రమల కోసం అంటూ వందల ఎకరాలను నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్‌కు కూటమి ప్రభుత్వం ధారదత్తం చేసింది. ఈ సంస్థ మంత్రి పార్థసారథి సతీమణి కమలాలక్ష్మి, ఆయన డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట ఏర్పాటైనదే..! కన్‌స్ట్రక్షన్, టెలికాం, కేబుల్స్ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తోంది.
⇒ తాజాగా రూ.150 కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద 20 టీపీడీ (టన్స్ పర్ డే) సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌కు ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా ఏకంగా రూ.845.60 ఎకరాల భూమిని అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా ఉత్తర్వులు ఇచ్చేసింది.
⇒ మొత్తం భూమిలో రూ.5 లక్షల చొప్పున 45.60 ఎకరాలను నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్‌కు పూర్తిగా విక్రయించేలా, సీబీజీ ప్లాంట్ పక్కనే ఖాళీగా ఉన్న మరో 800 ఎకరాలను నైపర్ గడ్డి పెంపకం కోసం లీజు విధానంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఏడాదికి రూ.15 వేల వంతున.. 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచుతారు.
అమ్మిన భూమి విలువే రూ.31 కోట్లు
ప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో ఎకరం భూమి ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పైనే పలుకుతోంది. అదే రోడ్డు పక్క భూములైతే రూ.కోటి పైమాటే. అంటే, ప్రభుత్వ ధర ప్రకారమే రూ.590 కోట్లకు పైగా విలువైన భూమి అన్నమాట. ఇందులో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎకరాలను అమ్మేసింది. దీని విలువే రూ.31.50 కోట్లు. ఇక రూ.15 వేలు లీజు చొప్పున 800 ఎకరాలను మంత్రి సంస్థకు కూటమి ప్రభుత్వం కానుకగా కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం భూములే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని రాయితీలతో పాటు కేంద్ర గ్రాంట్‌లను కూడా అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
రిలయన్స్ ప్లాంట్‌కు మించి..
వాస్తవానికి మంత్రి పార్థసారథి సంస్థకు కేటాయించిన భూములు.. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్‌కు కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో కేటాయింపు అంటే.. దీనివెనుక ఏదో అర్థం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కంపెనీలు
పార్థసారథి సతీమణి కమలా లక్ష్మి పేరిట నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్, మరో 4 కంపెనీలు ఉన్నాయి. 2006లో రూ.3.47 కోట్ల మూలధనంతో 301, స్వర్ణ ప్యాలెస్ 13, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ చిరునామాతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కారుణ్య పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హరిత పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు నేరుగా కొలుసు పార్థసారథి పేరును సూచించేలా కేపీఆర్ టెలీ ప్రొడక్ట్స్ పేరిట మరో కంపెనీ ఉంది. ఈ కంపెనీలతో తన అధికారాన్ని ఉపయోగించుకుని కన్‌స్ట్రక్షన్, సబ్ స్టేషన్లు, టెలికాం కేబుల్స్ నిర్మాణం వంటి కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు.
బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?
హైదరాబాద్ లులు మాల్‌కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం రూ.100 చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్‌కార్న్ కొందామంటే తక్కువలో తక్కువ రూ.250 వరకు వదిలించుకోవాలి. ఆ మాల్‌లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్ ఔట్ లెట్స్‌లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే.
సీఎం చంద్రబాబుతో లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ
కేవలం బడాబాబులు విలాసాల కోసం మాల్‌లు నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమంటే... కేరళ, హైదరాబాద్‌లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకుని రూ.1,500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది.
లులూ హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు.. లులుకు భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కే లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పప్పుబెల్లాల్లా భూములను పంచిపెట్టాడాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తక్షణం ఈ జీవో ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు.
అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అలాకాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణం అని పేర్కొంటున్నారు. లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే.. అలా రెండు రోజుల్లోనే జీవో వచ్చిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైనదో అర్థం అవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.
ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమి
జనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్‌కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్‌పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.