కోర్టు చెబితే ఇచ్చేయాలా? | Chandrababu Naidu govt ignores High Court verdicts in DSC case | Sakshi
Sakshi News home page

కోర్టు చెబితే ఇచ్చేయాలా?

May 28 2026 5:34 AM | Updated on May 28 2026 5:34 AM

Chandrababu Naidu govt ignores High Court verdicts in DSC case

విద్యాశాఖ కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

డీఎస్సీ వ్యవహారంలో హైకోర్టు తీర్పులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు 

అన్యాయం జరిగిందంటూ విద్యాశాఖపై 200మందికి పైగా అభ్యర్థులు కేసులు

అర్హత గల వారందరికీ ఉద్యోగాలివ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు

వాటిని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం

పలువురు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు

సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టిన హైకోర్టు

రెండు నెలల్లో ఆ అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వాలని మరోసారి ఆదేశాలు

ప్రక్రియ ముగిసిందంటూ ఆ ఆదేశాలను సైతం పట్టించుకోని వైనం

సాక్షి, అమరావతి: రేయింబవళ్లు కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికి ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం! మళ్లీ నోటిఫికేషన్‌ నాటికి వయసు ఉంటుందో మీరిపో­తు­ందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సీ–­2025లో కష్టపడి సాధించుకున్న ఉపా­ధ్యాయ ఉద్యోగాలను పలువురికి ఇచ్చేదిలేదు పొమ్మంది చంద్ర­బాబు ప్రభుత్వం. దాంతో అభ్యర్థులు హై­కోర్టును ఆశ్రయించగా, వారికి ఉద్యోగాలు ఇవ్వా­లని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం అప్ప­టికే నియామకాలు జరిగి పోయాయని చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపో­యిన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించగా, సర్కారు వాటినీ పెడచెవిన పెట్టింది. 

దాంతో అధికారులను ఇంప్లీడ్‌ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా దాదాపు 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీని ఎంత పారదర్శకంగా, ఘనంగా ఎలా చేపట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించామని సర్కారు పెద్దలు గొప్పలు చెబు­తున్నా, తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపికప్రక్రియ పూర్తయిపో­యిందని చెబుతున్న ప్రభుత్వం.. నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. 

ఆదిలోనే మెరిట్‌కు పాతర 
గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టు­లకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖా­స్తు­లు సమర్పించారు. అభ్యర్థులు వారి వారి అర్హత­లను బట్టి ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభగల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టుల్లో రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. 

వీటిల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ప్రాధాన్యక్రమంలో ఉంటాయి. ఒక ఎస్జీటీ 20 ఏళ్లకు పైగా పని చేసి, అర్హత సంపాదిస్తే స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. ఈ క్రమంలో రెండు లేదా మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్య­ర్థులు ఉన్నత ఉద్యోగం పొందాలనే కోరుకుంటారు. మెరిట్‌ ప్రకారం మూడు పోస్టులకు కాల్‌ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్‌ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. 

హైకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మంది డీఎస్సీ అభ్యర్థులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ (నం.4203/2025),  కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని తిరస్కరించిన ఘటనలో ఏఎస్సార్‌ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ 3470/25 వివరాలు 

సర్కారు తీరుపై న్యాయస్థానం ఆగ్రహం
డీఎస్సీలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా, ఆప్షన్‌ ఇవ్వ­­­లేదన్న కారణంతో 54 మందిని ఎస్జీటీలుగా పరి­గణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దా­ంతో న్యాయస్థానం విద్యా శాఖ తీరును తప్పు­బట్టింది. విద్య, వైద్యంలో మెరిట్‌ను కాదని, కింది వారికి అవ­కాశం ఇస్తే ఆ దేశం నాశనం అవుతుందని తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చే­యాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులి­చ్చింది. కానీ, కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌ 15 నాటికి డీఎస్సీ ఎంపిక, పోస్టింగ్స్‌ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలి­పి­ంది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్య­ర్థు­లు మరో­సారి న్యాయ­స్థానాన్ని ఆశ్రయించా­రు. 

ప్రభు­త్వ న్యాయ­వాది వారి స్థానాల్లో వేరే వారి­ని నియమించామని చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తమ మధ్యంతర ఉత్తర్వు­లను పట్టించుకోకుండా.. మీకు తోచిన సమా­ధానం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. రెండు నెలల్లోగా వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని జనవరి­లోనే తీర్పునిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధి­తులు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ ప్రక్రి­య ముగిసిపోయిందని, కొత్తగా ఎవరికీ ఉద్యో­గా­లు ఇచ్చే­­ది లేదని అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ బెద­రింపు ధోరణి ప్రదర్శించినట్టు బాధితులు వాపోయారు.

తప్పుపై తప్పులకు నిదర్శనాలెన్నెన్నో..
200 మందికి పైగా అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.

⇒ డీఎస్సీలో మెరిట్‌ సాధించినా పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పు­గోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేక పోవడంతో వారికి పోస్టింగ్‌ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ (నం.4203/2025) వేశారు. ఇందులో డీఎస్సీ నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజును ప్రధాన ప్రతివాదిగా చేర్చారు.

⇒ అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ (4261/25), బి.సరస్వతి (3585/25), వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ రాయల్‌ (3130/ 25) స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు (స్పోర్ట్స్‌ కోటా) ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించి తమ తప్పులేదని నిరూపించుకున్నారు.

⇒ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్‌ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్‌ (1347/26) స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించినా మెరిట్‌ కం రోస్టర్‌ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. తమకు అన్యాయం జరిగిందని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, వారికి పోస్టు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్‌ (3470/25) ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా, కుల ధ్రువీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దాంతో ఆయన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, స్థానిక తహసీల్దార్‌ నేతృత్వంలో అధికారుల కమిటీని వేసి దుర్గాప్రసాద్‌ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ సరైనదేనని నిర్ధారించారు. కానీ, అతనికి పోస్టు ఇవ్వలేదు. ఇదే కోవలో తిరుపతి జిల్లాకు చెందిన ఎ.శిరీష (3060/25) ఉద్యోగాన్ని కూడా ఎస్సీ సర్టిఫికెట్‌ ఫేక్‌ అని తిరస్కరించారు. ఆమె కూడా తన సర్టిఫికెట్‌ సరైనదేనని నిరూపించుకున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.

⇒ గుంటూరుకు చెందిన జి.రాజేశ్‌ దినకర్‌ (1335/26) ఫిజికల్‌ హ్యాండీక్యాప్డ్‌ సర్టిఫికెట్‌ ‘ఫేక్‌’ అని ఎస్‌ఏ పోస్టు తిరస్కరించారు. దాంతో మరోసారి గుంటూరు వైద్యుల కమిటీ ముందు హాజరై సచ్చీలతను నిరూపించుకున్నారు. సదరం సర్టిఫికెట్‌ సరైనదేనని ధ్రువీకరించినా పోస్టు ఇవ్వలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement