సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం | Chandrababu Naidu government restrictions on freedom of expression | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం

Mar 22 2026 4:01 AM | Updated on Mar 22 2026 4:01 AM

Chandrababu Naidu government restrictions on freedom of expression

నియంత బాబు విశ్వరూపం

హెరిటేజ్, బీఆర్‌ నాయుడు పేర్లతో పోస్టు పెట్టారో జాగ్రత్త

బెదిరింపు నోటీసులిచ్చి పోస్టులు డిలీట్‌ చేయిస్తున్న వైనం

ఫేస్‌ బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ సంస్థలకూ నోటీసులు

పూర్తిగా సహకరిస్తున్న పోలీసు డిపార్ట్‌మెంట్‌

ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న దాడి..

ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు దారుణమంటున్న న్యాయనిపుణులు

సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్‌ సిండికేట్‌ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు.. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టిన టీవీ5 అధినేత బీఆర్‌నాయుడి రాసలీలలు బయటపడి వేంకటేశ్వరస్వామి భక్తులంతా ఛీకొడుతుండడం మరోవైపు.. అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ఈ విమర్శల జడిలో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎవరూ ఈ విషయాలపై మాట్లాడకుండా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యింది. 

ముఖ్యంగా సోషల్‌ మీడియాలోని అన్ని వేదికలలోనూ హెరిటేజ్, బీఆర్‌ నాయుడు అనే పేర్లు కనబడకుండా చేయడానికి మాస్టర్‌ప్లాన్‌ వేసింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు నుంచి ఈనెల 3న ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలో కూడా బీఆర్‌ నాయుడు, హెరిటేజ్‌ లపై ఏ విధమైన ప్రచారం చేయకూడదని, ఎలాంటి పోస్టులు ఉన్నా తొలగించాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. 

ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ నాయుడు, హెరిటేజ్‌ అనే పేర్లు కనపడితే చాలు, వెంటనే రిమూవ్‌ చేయాలంటూ ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. వేదిక ఏదైనా సరే.. బీఆర్‌ నాయుడు, హెరిటేజ్‌ అనే పేరుతో ఆ పోస్టులు ఉంటే ఆయా సంస్థలకు నోటీసులు పంపి, బలవంతంగా పోస్టులను డిలీట్‌ చేయిస్తున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను అడ్డుపెట్టుకుని సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్‌ ఈ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న దాడేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

డిలీట్‌ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు..
ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే సాకుతో సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. నేరుగా వారికి మెయిల్స్‌ చేయడంతో పాటు, సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. అందులో వేలాది మంది పేర్లను, ఐడీలను పేర్కొంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలంటూ..  సబ్జెక్ట్, కంటెంట్‌ తో సంబంధం లేకుండా హెరిటేజ్, బీఆర్‌ నాయుడు అనే పదాలు ఉంటే చాలు, వీడియో అయినా, పోస్ట్‌ అయినా, పోస్టర్‌ అయినా, మీమ్‌ అయినా, నాలుగు అక్షరాలైనా సరే.. డిలీట్‌ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. చివరికి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోలు కూడా డిలీట్‌ చేయాలంటూ నోటీసులిస్తున్నారంటే సోషల్‌ మీడియా దెబ్బకు ప్రభుత్వ పెద్దలు ఎంతలా భయకంపితులు అవుతున్నారో అర్థమవుతుంది.  

మరింత మందికి తెలియకూడదనే..
ఇటీవల టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యవహారం.. ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై పోస్టులు, వీడియోలు, మీమ్స్‌ వెల్లువెత్తాయి. పవిత్రమైన టీటీడీ చైర్మన్‌ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేసిన బీఆర్‌ నాయుడును వెంటనే తొలగించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.  కానీ, తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చంద్రబాబు సర్కార్‌ కక్షసాధింపులకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

ఇక హెరిటేజ్‌ విషయంలోనూ ప్రభుత్వం నిజాలు బయటకు రానీయకుండా అడ్డుకుంటోంది. హెరిటేజ్, ఇందాపూర్‌ డెయిరీ ఇష్యూ, అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంలో చనిపోవడం, వీఎస్‌ఆర్‌ సంస్థకు హెరిటేజ్‌ కు సంబంధాలు బయటపడటంతో చంద్రబాబు సర్కార్‌ బెంబేలెత్తింది. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టులన్నీ డిలీట్‌ చేయిస్తోంది. అజిత్‌ పవార్‌ మేనల్లుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ మాట్లాడిన మాటలు పోస్టు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి డిలీట్‌ చేయించారు.

భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట..
వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా దాడికి పాల్పడుతోంది. అన్యాయాలపై, దుర్మార్గాలపై వాయిస్‌ వినిపించ­కుండా చేస్తున్న దాడి అత్యంత దారుణం.  రాష్ట్రంలో సోషల్‌ మీడియా వేదికలపై జరుగుతున్న ఇలాంటి పరిణామాలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కేసులు, నోటీసులు, పోస్టుల తొలగింపు ముమ్మాటికీ నియంత పాలనకు నిదర్శనం.   – కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది 

Advertisement
 
Advertisement
Advertisement