ఆంద్రప్రదేశ్‌లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.
చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?
గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్‌కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్‌్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి?
పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్‌లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.
ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్‌గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు.
ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్‌సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్‌లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.
ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి.
రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది.
తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


