అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం! | Chandrababu Govt Endless Negligence On DSC 2025 | Sakshi
Sakshi News home page

అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం!

Jun 1 2026 4:38 AM | Updated on Jun 1 2026 4:38 AM

Chandrababu Govt Endless Negligence On DSC 2025

డీఎస్సీ–2025లో మెగా లొసుగులు..

సర్టిఫికెట్ల పరిశీలనలో కనీసం గడువు ఇవ్వకుండా ‘రిజెక్ట్‌’ 

పొరపాట్లు సరిచేసుకునే వెసులుబాటు ఇవ్వకుండా తిరస్కరణ

రిజర్వేషన్‌ అమలులోనూ తప్పులతడకే.. మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ విధానం తుంగలోకి.. 

ఏపీపీఎస్సీ విధానాలు ఏ ఒక్కటీ అనుసరించని విద్యాశాఖ

సాక్షి, అమరావతి: పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్‌ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డీఎస్సీ–­2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు. మెరిట్‌.. వెర్టికల్‌.. హారిజాంటాల్‌ రిజర్వేషన్‌ ప్రకా­రం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్క­డా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టు­కు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రా­ష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధివిధానాలను అత్యంత జాగరూకతతో రూపొందిస్తుంది. 

ఆ విధానాలను మెగా డీఎస్సీ 2025లో ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం.. తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడుపుఠాణి బోధపడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘నేను 25 ఏళ్లుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నా. ఎన్నో డీఎస్సీలు నిర్వహించినా ఈ తరహా ప్రక్రియ ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి..’ అని విద్యాశాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం మెగా డీఎస్సీ నిర్వహణలో లొసుగులకు అద్దం పడుతోంది.   

అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడి రిజెక్ట్‌..! 
ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాల్లో హాల్‌టికెట్‌ నంబర్‌ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్‌ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు..? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు..? ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్‌ అభ్యర్థి ఎవరు..? అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు. 

లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డీఎస్సీ–2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపినా మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ (వర్టికల్‌/హారిజాంటాల్‌) ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్‌ లెటర్లు వెళతాయి. అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డీఎస్సీ 2025 కాల్‌ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్‌లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డీఎస్సీ అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు.  

ఇదేం రిజర్వేషన్‌ లెక్కో?  
1:1 నిష్పత్తి ప్రకారం జోన్‌ ఆఫ్‌ కన్సిరడేషన్, పోస్ట్‌ పరిధిలోకి వచ్చిన వారికి మాత్రమే కాల్‌ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హారిజాంటాల్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు మెరిట్‌ ద్వారా, 3 పోస్టులు హారిజాంటాల్‌ ద్వారా (ఉమెన్‌/ స్పోర్ట్సు/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ పీడబ్లు్యడీ (ప్రత్యేక అవసరాలు) భర్తీ చేయాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఏకాంబరం (బీసీ–డీ) వివరాలను ఉదహరించారు. చిత్తూరు జిల్లాలో బీసీ–డీ కేటగిరిలో 7 పోస్టులు ఉండగా ఒకటి హారిజాంటాల్‌లో ఉమెన్‌కు కేటాయిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియలో 5 పోస్టులను మెరిట్‌ ప్రకారం, 2 పోస్టులను హారిజాంటల్‌లో భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. మెరిట్‌లో చివరి ర్యాంకర్‌ 114కి ఇచ్చామని (వాస్తవానికి 114వ ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినా బీసీ–డీలో చూపించారు), కానీ ఏకాంబరం ర్యాంకు 125 కాబట్టి అతడికి పోస్టు వచ్చే అవకాశం లేదని చెప్పారు. మెరిట్‌లో ఉమెన్‌ లేకపోతే హారిజాంటాల్‌ ప్రకారం కింద ర్యాంకు ఎంత ఉన్నా పైకి తెచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు.  

అర్హత ఉన్నా ఏకాంబరానికి అన్యాయం! 
వాస్తవానికి మెరిట్‌లో భర్తీ చేసిన ఐదు పోస్టుల్లో చివరి అభ్యర్థి ఉమెన్‌. ఆమె ఓవరాల్‌ ర్యాంకు 116. దీంతో హారిజాంటల్‌ పోస్టు భర్తీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు పోస్టులను మెరిట్‌లో భర్తీ చేయాలి. 116వ ర్యాంకు అభ్యర్థి తర్వాత... ఆరో స్థానంతో 125వ ర్యాంకు సాధించిన ఎం.ఏకాంబరం ఉన్నారు. అతడికి ఒక పోస్టు ఇస్తే, మరో పోస్టును 133వ ర్యాంకులో ఉన్న మరో అభ్యర్థికి (బీసీ–డీలో 7వ ర్యాంకు) ఇవ్వాలి. కానీ చివరి రెండు పోస్టులను పీహెచ్‌ అభ్యర్థులతో నింపారు. వాస్తవానికి జిల్లాలో ఎస్‌ఏ సోషల్‌కు 113 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్ని కేటగిరీల (బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓసీ) అభ్యర్థులకు వర్టికల్‌ రిజర్వేషన్‌లో చూపించారు. అయితే స్పోర్ట్సు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, పీడబ్లు్యడీ వారికి వర్టికల్‌ రిజర్వేషన్‌లో కాకుండా హారిజాంటల్‌లో చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎవరిని భర్తీ చేస్తారో నోటిఫికేషన్‌లో చెప్పకుండా బీసీ–డీ కేటగిరీలోని రెండు పోస్టులను పీడబ్లు్యడీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం అన్ని పోస్టులోనూ హారిజాంటల్‌లో పీడబ్లు్యడీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు కేటాయిస్తే.. వాటిలో రెండు బీసీ–డీలోనే భర్తీ చేయడంతో ఆ వర్గంలో మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో అర్హుడైనప్పటికీ ఏకాంబరం పోస్టు కోల్పోవాల్సి వచ్చింది.  

డిలీట్‌.. అప్‌లోడ్‌.. డిలీట్‌! 
వెబ్‌సైట్‌లో డీఎస్సీ జాబితాపై దాగుడుమూతలు 
మెగా డీఎస్సీ 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డీఎస్సీ ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచి పెట్టేందుకు వెబ్‌సైట్‌ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు.. తాజాగా డేటాను మళ్లీ అప్‌లోడ్‌ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్‌లోడ్‌ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్‌లోడ్‌ చేసి మళ్లీ వాటిని తొలగించడం కొసమెరుపు. డీఎస్సీలో అక్రమాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. డీఎస్సీ డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు.  

Advertisement
 
Advertisement
Advertisement