ఎల్‌వోసీ.. దోచేసి 'సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా'! | Chandrababu Govt corruption In CMRF Funds | Sakshi
Sakshi News home page

ఎల్‌వోసీ.. దోచేసి 'సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా'!

Apr 10 2026 5:04 AM | Updated on Apr 10 2026 5:14 AM

Chandrababu Govt corruption In CMRF Funds

చంద్రబాబుతో టీడీపీ నేత రేవూరి వేణుగోపాల్‌ (ఫైల్‌) , మంత్రి లోకేశ్‌తో టీడీపీ నేత వేణుగోపాల్‌ (ఫైల్‌)

మండలస్థాయి నుంచి నియోజకవర్గాల వరకు కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల వసూళ్ల పర్వం

పలువురు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా అందిన దరఖాస్తులు బోగస్‌ 

సొంతంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు నిర్వహిస్తున్న కొందరు కూటమి ప్రజాప్రతినిధులు 

ఆస్పత్రులకు ఎల్‌ఓసీల మంజూరులో అక్రమాలు.. అనారోగ్య బాధితులకు అందాల్సినవి పక్కదారి

అటు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఇటు వాటాల దందా.. పేదలకు ఉచిత వైద్యానికి బాబు సర్కారు తూట్లు  

రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కుతున్న అవినీతి

దేశ చరిత్రలో నీతి బాహ్యమైన, సిగ్గుమాలిన వ్యవహారాలకు పరాకాష్ట

కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్సార్‌ కడప జిల్లా నందలూరు మండలం కుందా నెల్లూరుకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తుంటి ఎల్లయ్య ఒక కంటిచూపు కోల్పోయాడు. చెన్నైలో చికిత్స కోసం రూ.35 లక్షలు ఖర్చైంది. సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నాయకులు ఎల్లయ్యతో పలు కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. ఇంటికి వచ్చాక బాధితుడి ఖాతాకు రూ.14 లక్షలు జమ కాగా... అందులో రూ.8 లక్షలు టీడీపీకి చెందిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఎల్లయ్యతో ముందుగానే బ్యాంకు కాగితాలపై సంతకాలు పెట్టించుకుని డబ్బులు బదిలీ చేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘మాకు ఖర్చులు ఉంటాయి. అందరికీ పర్సంటేజీలు ఇవ్వాలి.. !’ అని టీడీపీ నేతలు చెబుతున్నారని ఎల్లయ్య గోడు వెళ్లబోసుకున్నాడు.    

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు, అవినీతిని చంద్రబాబు సర్కారు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కిస్తోంది. అనారోగ్యం పాలై ఆపదలో ఉన్న పేదవాడిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌)ని అక్రమార్కులకు అక్షయపాత్రలా మార్చేసింది. ఇసుక, మట్టి, సిలికా, గ్రానైట్, క్వార్ట్జ్, లేటరైట్, గనులు, ప్రకృతి వనరులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పచ్చముఠాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నా సరిపోలేదన్నట్లుగా.. బినావీులకు 99 పైసలకే భూములను పందేరం చేస్తూ, బంధుగణానికి విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోచిపెట్టడంతోపాటు కుటుంబ కంపెనీకి రూ.వంద కోట్ల మేర రాయితీలు ఇచ్చినా ఇంకా చాలదన్నట్లుగా బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పేదలకు అందాల్సిన అన్ని పథకాలు ఆపేసి ఆరోగ్యశ్రీని అంపశయ్యపైకి చేర్చారు. ఆరోగ్య ఆసరా అసలే లేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. 

చివరకు ఎంతకు బరి తెగించారంటే.. అనారోగ్యం పాలైన పేదలను ఆదుకోవాల్సిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ డబ్బుల్లోనూ కమీషన్లు వసూలు చేస్తున్న వైనం ఆధారాలతో బహిర్గతమైంది. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ, ఆస్పత్రులకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) జారీ, బిల్లుల చెల్లింపుల్లో భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఎన్నడూ ఆస్పత్రి ముఖం కూడా చూడని వ్యక్తులను రోగులుగా చిత్రీకరించి రూ.లక్షల్లో నకిలీ బిల్లులు పెట్టడం.. కూటమి ప్రజాప్రతినిధులకు చెందిన వారు డీల్‌ కుదుర్చుకున్న ఆస్పత్రులకే పెద్ద ఎత్తున ఎల్‌ఓసీలు జారీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ కాంట్రాక్టుల్లో వాటాలు వసూలు చేసుకోవడం చూశాం.. 79 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి నీతి బాహ్యమైన, సిగ్గుమాలిన, దిక్కుమాలిన వ్యవహారాలను ఇప్పుడే చూస్తున్నామని, చంద్రబాబు సర్కారు దిగజారుడు, అవినీతి బాగోతాలకు ఇది పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


దందాలో 10 మంది ఎమ్మెల్యేల పీఏలు..
అనారోగ్యం బారినపడ్డ అభాగ్యులు, నిరక్ష్యరాస్యులను ప్రధానంగా టార్గెట్‌గా చేసుకుని కూటమి ప్రజాప్రతినిధుల అనుచరులు, దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందక అప్పుల పాలైన రోగులను ట్రాప్‌ చేసి నకిలీ బిల్లులను సృష్టిస్తున్నారు. వాటిని సచివాలయంలో ప్రాసెస్‌ చేయించి చెక్కుల జారీ వరకూ ఆద్యంతం ఫాలో అప్‌ చేస్తున్నారు. రోగుల పేరుతో డబ్బు జమ కాగానే తమ జేబులో వేసుకుంటున్నారు. సీఎంఆర్‌ఎఫ్‌లో జరుగుతున్న ఈ అక్రమాలు ఇటీవల బహిర్గతమయ్యాయి. సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీల కోసం పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా అందిన దరఖాస్తులు బోగస్‌ అని గుర్తించినట్లు సమాచారం. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేయకుండా బాపట్ల, పోలవరం, శ్రీకాకుళం, తిరుపతి, అనకాపల్లి తదితర జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేల పీఏలను బాధ్యులుగా తేల్చి చేతులు దులిపేసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ బిల్లుల వ్యవహారంలో ‘ముఖ్య’ కార్యాలయం ఉద్యోగుల హస్తం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైందని సచివాలయ అధికారుల్లో చర్చ నడుస్తోంది.  

డీల్‌ కుదుర్చుకుని ఎల్‌ఓసీలు..
రోగులకు చికిత్సకు ముందుగా ఆస్పత్రులకు ప్రభుత్వం జారీ చేసే ఎల్‌ఓసీలకు సంబంధించి భారీ అక్రమాలు జరుగుతున్నట్లు వైద్య వర్గాల్లో చర్చ సాగుతోంది. గుండె, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, వివిధ ప్రమాదాల్లో గాయపడిన నిజమైన బాధితులకు ఎల్‌ఓసీలు అందక అల్లాడుతుండగా.. దళారులు, కూటమి ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన ఫైళ్లు మాత్రం నిమిషాల్లో క్లియర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు కోరినంత కమీషన్‌ ముట్టజెప్పేలా డీల్‌ కుదుర్చుకున్న ఆస్పత్రులకే పెద్ద మొత్తంలో ఎల్‌ఓసీలు అందుతున్నాయి. మరోవైపు కూటమి పార్టీల్లో కొందరు ఎమ్మెల్యేలు స్వతహాగా వైద్యులు కావడంతో సొంతంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. 

వాటి ద్వారా ఇష్టారాజ్యంగా ఎల్‌ఓసీ దరఖాస్తులు పంపుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆస్పత్రి.. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మహిళా నాయకురాలి ఆస్పత్రి.. గుంటూరు, విజయవాడ, విశాఖ, కర్నూలు ప్రాంతాల్లోని టీడీపీ నాయకుల ఆస్పత్రులకు పెద్ద మొత్తంలో సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీ ద్వారా నిధులు మళ్లించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్‌లోని తమ బంధువు ఆస్పత్రికి ఎడాపెడా ఎల్‌ఓసీలు ఇచ్చేస్తున్నారు. క్యాన్సర్‌ వైద్యం అందించే ఈ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కవర్‌ అయ్యే ప్రొసీజర్లకూ ఎల్‌ఓసీలు అడుగుతూ రెండు రెట్లు అధికంగా నిధులు రాబట్టుకుంటున్నారు.

ఆరోగ్యశ్రీని అస్తవ్యస్థం చేసి..
గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 ప్రొసీజర్‌లను తెచ్చారు. దీంతో అన్ని రకాల క్యాన్సర్‌లతో పాటు ఇతర జబ్బులకు ఆరోగ్యశ్రీలోనే ఉచిత చికిత్సలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అస్తవ్యస్థం చేసి సీఎంఆర్‌ఎఫ్‌ సాయం పేరిట పచ్చముఠాల దోపిడీకి తెర తీసింది. ముఖ్యనేత కార్యాలయం నుంచి మండల స్థాయిలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల వరకూ కాసులు పిండుకుంటున్నారు. వైద్యం కోసం అప్పుల పాలైన రోగులను ఆసరాగా చేసుకుని సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను స్వాహా చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement