అమరావతిలో ‘అసైన్డ్‌’ దురాక్రమణ | The land deal was exposed with evidence in the CID investigation | Sakshi
Sakshi News home page

అమరావతిలో ‘అసైన్డ్‌’ దురాక్రమణ

Apr 9 2026 5:03 AM | Updated on Apr 9 2026 5:06 AM

The land deal was exposed with evidence in the CID investigation

పేదల భూములను కొల్లగొట్టిన బాబు బృందం.. రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం

ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టి దోపిడీ.. బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో దందా 

ఆ భూబాగోతం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో బట్టబయలు

ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ.. ఆ కేసును అడ్డగోలుగా క్లోజ్‌ చేసిన కూటమి ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించడం వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. అమరావతి ముసుగులో చంద్రబాబు ముఠా బరి తెగించి భూ దోపిడీ సాగించింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములను ‘పచ్చ ముఠా’ పెద్ద ఎత్తున కొల్లగొట్టింది. అందుకోసం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చంద్రబాబు – నారాయణ సూత్రధారులు, పాత్రధారులుగా దేశ చరిత్రలో అతిపెద్ద అసైన్డ్‌ భూ దోపిడీకి బరి తెగించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్‌ భూములను గుంజుకున్నారు. ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్‌ భూదోపిడీకి పాల్పడి పేదల భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్‌ భూములకు పరిహారం ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించిన టీడీపీ పెద్దలు వారి భూములను 1,336 మంది బినామీల ముసుగులో కొల్లగొట్టారు. అనంతరం తాపీగా అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడినట్లు సీఐడీ గతంలోనే నిర్ధారించింది. 

ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌ïÙట్‌ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్‌ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. 

అయితే 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ ముసుగులో ఈ కేసును క్లోజ్‌ చేసింది. చంద్రబాబు ముఠా అసైన్డ్‌ భూదోపిడీకి అమరావతి మూగసాక్షిగా నిలుస్తోంది. ఆ భూ బాగోతం ఇదిగో ఇలా ఉంది...! 

సిట్‌ విచారణలో ఆధారాలతో సహా బయటపడ్డ వాస్తవాలు..  1954 తర్వాత అసైన్డ్‌ భూములు పంపిణీ జరిగినట్లు రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదిక    

జీవో 1తో భయపెట్టి..  జీవో 41తో భూదోపిడీ 
విభజన తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు పన్నాగం పన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి వారి అసైన్డ్‌ భూములను కొల్లగొట్టారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని పేరుతో భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న జీవో నంబరు 1 జారీ చేశారు. ఆ జీవోలో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. 

అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభు­త్వం అసైన్డ్‌ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వ­కుండా ఉచితంగా తీసుకుంటుందని ప్రచారం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులు ముట్టచెబుతామని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆర్కే హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయించారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్‌ భూములను సేల్‌ డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. 

ఇలా చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌  ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలు చేసి అసైన్డ్‌ భూములన్నీ తమ బినామీల పరం చేశారు. అనంతరం చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్‌ భూములకు భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్‌ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం సీఆర్‌డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ జీవో జారీ చేశారు. 

ఆ చట్టం ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్‌ ఆమోదం తప్పనిసరి. కానీ అసైన్డ్‌ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీవో 41ను తెచ్చింది. అందుకు కేబినెట్‌ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్‌లో చర్చించకుండానే ఏకపక్షంగా జీవో 41ను అడ్డదారిలో జారీ చేసింది. తద్వారా కేబినెట్‌ ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్‌డీఏ చట్టాన్ని ఉల్లంఘించింది.  

1954 తర్వాత అమరావతి ప్రాంతంలో అసైన్డ్‌ భూములు పంపిణీ చేయలేదని టీడీపీ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక  

న్యాయస్థానం కళ్లుగప్పి... 
కేంద్ర  ప్రభుత్వ అసైన్డ్‌ భూముల పరిరక్షణ చట్టాన్ని కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. ఆ చట్టం ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అప్పటి కలెక్టర్, సీఆర్‌డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖల ఉన్నతాధికారులు, అడ్వకేట్‌ జనరల్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు తమ బినామీల ద్వారా కొల్లగొట్టిన భూములకు ప్యాకేజీ ప్రకటించారు. 

ఆ అసైన్డ్‌ భూములన్నీ 1954కు ముందు పంపిణీ చేసినవేనని... ఆ తరువాత 2015లోపు అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేశారు. అయితే అమరావతిలోని అసైన్డ్‌ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి రావడంతో చంద్రబాబు ముఠా దోపిడీ బయటపడింది. 

రూ.5,500 కోట్ల అసైన్డ్‌ భూదోపిడీ 
అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాలను మొత్తం 1,336 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటించిన లెక్కల ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500కోట్లు. అంటే చంద్రబాబు ముఠా ఎంతటి భారీ భూదోపిడీకి పాల్పడిందన్నది స్పష్టమవుతోంది.  

ఏ1 చంద్రబాబు, ఏ 2 నారాయణ 
నిబంధనలకు విరుద్ధంగా జీవో 41ను అప్పటి పురపాలక–సీఆర్‌డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016 ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016 మార్చి 22న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పోస్ట్‌–ఫాక్టో–ర్యాటిఫికేషన్‌ చేసి మరీ ఆమోదించారు. అంటే అసైన్డ్‌ భూములు కొల్లగొట్టేందుకు జీవో 41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. సీఐడీ సిట్‌ దర్యాప్తులో ఈ  కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఆమేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్‌డీయే, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. 

అసైన్డ్‌ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీవో 41 జారీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆ విధంగా జారీ చేసిన జీవో 41తో అమరావతి పరిధిలోని 1,100 ఎకరాల అసైన్డ్‌ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్ట కొట్టింది. చంద్రబాబు ముఠా అవినీతిని సిట్‌ ఆధారాలతో  సహా నిగ్గు తేల్చింది. కాగా 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసు దర్యాప్తును నిలిపివేసింది. సిట్‌ను రద్దు చేసింది.

ప్రధాన నిందితుడైన చంద్రబాబే ఆ కేసులను ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించారు. తద్వారా సీఐడీ అధికారులకు ‘కర్తవ్యబోధ’ చేశారు. అనంతరం సీఐడీ అధికారులు అసైన్డ్‌ భూముల కేసులో రివైజ్డ్‌ చార్జ్‌షీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయలేదు. అంతేకాదు ఈ కేసులో సాక్షులుగా ఉన్న అప్పటి సీఆర్‌డీయే అధికారులు, రెవెన్యూ అధికారులను బెదిరించారు. వారు గతంలో న్యాయస్థానంలో ఇచ్చిన 164 సీఆర్‌పీసీ వాంగ్మూలాలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. 

అనంతరం ఆ కేసును ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’అని ముద్ర వేస్తూ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ఆ కేసును మూసివేసేందుకు అనుమతించాలని కోరారు. అధికార దుర్వినియోగంతో అసైన్డ్‌ భూముల దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేసినా సరే ప్రజాన్యాయస్థానంలో చంద్రబాబు దోషిగానే నిలబడ్డారన్నది ముమ్మాటికీ నిజం. అమరావతి సాక్షిగా చంద్రబాబు ముఠా భూదోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా అసైన్డ్‌భూముల దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేయడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement