అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు | Botsa Satyanarayana complains to governor on Chandrababu govt | Sakshi
Sakshi News home page

అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు

Apr 9 2026 5:15 AM | Updated on Apr 9 2026 5:15 AM

Botsa Satyanarayana complains to governor on Chandrababu govt

గవర్నర్‌కు మండలిలో విపక్ష నేత బొత్స ఫిర్యాదు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేస్తూ వాటిని దాచిపెట్టి చట్టసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్‌లోనూ, బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు చేస్తూ వాస్తవ వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. చట్ట సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలను మోసగించడమేనని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బొత్స బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర అప్పులపై వాస్తవాలతో పాటు శాసన మండలి సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ ఇచ్చిన తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ గవర్నర్‌కు లేఖ రాశారు. అప్పులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడమంటే ఆర్థిక శాఖ అధికారులు సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సభకు సమాధానం ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా, జవాబుదారీతో ఉండాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులకు గట్టిగా చెప్పాలని ఆ లేఖలో బొత్స విజ్ఞప్తి చేశారు.  

ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టారు.. 
2024–25, 2025–26లో రాష్ట్ర అప్పుల వివరాలపై మండలి గత సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ తప్పుడు గణాంకాలతో సమాధానం ఇచ్చిందని బొత్స లేఖలో పేర్కొన్నారు. 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని ‘కాగ్‌’ (కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) మార్చి 6వ తేదీన సభకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసిందని, అయితే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం 2024–25లో అప్పు రూ.60,485.40 కోట్లుగా పేర్కొన్నారని బొత్స గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. మరోవైపు 2025–26 ఆర్థిక ఏడాది తొమ్మిది నెలల్లో రూ.85,269.19 కోట్లు అప్పులు చేస్తే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం రూ.53,878.71 కోట్లుగా> సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టి తక్కువగా చూపించినట్లు తేలిందన్నారు. 

కాగ్‌ నివేదికతో పాటు బడ్జెట్‌ డాక్యుమెంట్లలో 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు  తప్పుడు సమాచారం ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 2024–25, 2025–26లో బడ్జెటేతర అప్పుల వివరాలను వెల్లడించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు కోరగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయంలో కూడా తప్పుడు సమాచారాన్ని సభకు సమర్పించినట్లు తెలిపారు. రూ.53,878.71 కోట్లు మినహా 2025–26లో ప్రభుత్వం మరే ఇతర రుణం తీసుకోలేదని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. పలు కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు చేస్తున్నా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు.  

ప్రభుత్వ అధికారి ఇలా చట్టసభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ఆ శాఖ ప్రతిష్టను,  ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. తప్పుడు సమాధానాలు ఆర్థిక శాఖ సమగ్రతకు హాని కలిగించమే కాకుండా చట్ట సభ స్థాయిని దిగజార్చి కించపరచడమే అవుతుందని బొత్స పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో బడ్జెటేతర అప్పులను మాత్రమే సమాధానంలో ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంలో చేసిన అప్పులను దాచి పెట్టడం ద్వారా ఆర్థిక శాఖ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికారులు రాజకీయ వైఖరితో సమాధానాలు చెప్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. జవాబుదారీతనంతో చట్టసభలకు వాస్తవ సమాచారాలను అందించాల్సిన కార్య నిర్వాహక వర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని, ఇలా తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడమేనని బొత్స స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement