నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.19.79 కోట్ల మోసాలకు పాల్పడిన ఎలియాజ్ బాషా
నిందితుడిని అరెస్ట్ చేసిన సీజీఎస్టీ అధికారులు
నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన ఆర్థిక నేరాల కోర్టు
సాక్షి, విశాఖపట్నం : ఎలాంటి వస్తువులు కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇన్‌పుట్ ట్యాక్స్ కొట్టేసిన వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విశాఖ జోనల్ యూనిట్ అధికారులు వలపన్ని ఛేదించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన దావూద్ హార్డ్‌వేర్ సిమెంట్స్ సంస్థ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి సుమారు రూ.19.79 కోట్ల మేర ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కుంభకోణం బట్టబయలైంది.
డీజీజీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కంపెనీల పేరుతో.. ఎలాంటి వ్యాపారం జరగకపోయినా జరిగినట్లుగా రికార్డులు సృష్టించిన కేసులో ఎలియాజ్ బాషాను అరెస్ట్ చేశారు. తన సోదరుడికి చెందిన దావూద్ హార్డ్‌వేర్ సంస్థను అడ్డం పెట్టుకుని వివిధ సంస్థలకు నకిలీ రశీదులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులపై సీజీఎస్‌టీ చట్టం–2017 ప్రకారం అరెస్ట్ చేసి విశాఖ ఆర్థిక నేరాల కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీజీజీఐ అధికారులు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం డీజీజీఐ అధికారులు ఇప్పటివరకు దాదాపు రూ.352 కోట్లకు పైగా జీఎస్టీ మోసాలను గుర్తించి, ఈ కుంభకోణాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులతో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.


